ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

- December 25, 2025 , by Maagulf
ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సౌదీ అరేబియా విమానయాన సంస్థ ఫ్లైనాస్‌కు చెందిన విమానంలో ఐదు ఆర్‌డీఎక్స్ బాంబులు అమర్చినట్లు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయించారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాలను పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకుని, అనుమానాస్పద కదలికలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అమలు చేశారు.

సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు ఇతర భద్రతా బృందాలు విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నాయి. ప్రయాణికులు, విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన కారణంగా కొంతసేపు విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఇతర విమానాల రాకపోకలపై కూడా స్వల్ప ప్రభావం పడింది. తనిఖీలు పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com