నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి

- December 25, 2025 , by Maagulf
నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి

నైజీరియా: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో మరోసారి ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని రద్దీగా ఉండే మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో కనీసం 10 మంది ప్రార్థనలో ఉన్న భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సాయంత్రం వేళ పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదుకు చేరుకుని ప్రార్థనల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. గంబోరు మార్కెట్ ప్రాంతంలోని ఈ మసీదులో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి. పేలుడు తీవ్రతకు మసీదు భాగాలు కూలిపోవడంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో హాహాకార పరిస్థితి నెలకొంది.

మసీదు లోపల ముందే అమర్చిన బాంబు పేలి ఉండవచ్చని, (Borno state attack) లేదా ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని స్థానిక భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత స్వీకరించలేదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో గతంలోనూ దాడులకు పాల్పడిన బోకో హరామ్ లేదా ఐసిస్ అనుబంధ గ్రూపులే దీనికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

2009 నుంచి నైజీరియాలో కొనసాగుతున్న ఉగ్రవాద హింసలో ఇప్పటివరకు సుమారు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 20 లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా మైదుగురిలో దాడులు తగ్గినప్పటికీ, మళ్లీ మసీదునే లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం స్థానికుల్లో భయాందోళనలు పెంచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com