ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..

- December 30, 2025 , by Maagulf
ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు సరికొత్త డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆర్టీసీ బస్సు టికెట్లను వాట్సప్ ద్వారానే సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సప్ గవర్నెన్స్ సేవలలో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

ఈ విధానంతో ప్రయాణికులు మూడు నిమిషాల్లోనే టికెట్ బుకింగ్ పూర్తి చేయవచ్చు. టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రయాణికులు 95523 00009 నంబర్‌కు ‘హాయ్’ అని వాట్సప్ మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఆర్టీసీ సేవలను ఎంపిక చేసి, ప్రయాణ ప్రారంభం, గమ్యం, తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి. పేమెంట్ పూర్తయ్యాక టికెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే వాట్సప్ ద్వారా అందుతాయి.

ఈ కొత్త విధానం ముఖ్యంగా ఇంటర్నెట్ యాప్‌ లు ఉపయోగించడంలో ఇబ్బంది పడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అదనంగా, కౌంటర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు ఈ సౌకర్యం మరింత ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు.

డిజిటల్ పాలనలో భాగంగా తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ప్రయాణికుల సౌకర్యం పెరగడమే కాకుండా, ఆర్టీసీ సేవల్లో పారదర్శకత, వేగం మరింత మెరుగుపడనుంది. భవిష్యత్‌లో మరిన్ని సేవలను కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com