తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- December 30, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.శ్రీవారి దర్శనానంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.శ్రీవారి ఆలయం, బయటి క్యూలైన్లలో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లపై పలువురు భక్తులను అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు.ఈ పర్వదినం సందర్భంగా టీటీడీ ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయని చెప్పారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వేకువజామున 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచిన అనంతరం అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. తొలిమూడు రోజులు ఈ-డిప్ ద్వార టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని తెలిపారు.
టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని చెప్పారు. టీటీడీ ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వార ఇచ్చే సూచనలను పాటిస్తూ దర్శన ప్రణాళికలను రూపొందించుకుంటే ఎలాంటి ఇబ్బందిలేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు. దాదాపు 3500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బంది పగడ్భందీ ప్రణాళికలతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తొలిమూడు రోజుల పాటు టోకెన్ కలిగిన భక్తులు నిర్దేశిత టైమ్ స్లాట్ ప్రకారం దర్శన క్యూలైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని తెలియజేశారు.
వైభవంగా స్వర్ణరథోత్సవం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాలంకరణ
శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులకు గొప్ప అనుభూతి పొందేలా ముస్తాబు చేశారు. పది రోజుల పాటు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, నాలుగు టన్నుల కట్ ఫ్లవర్స్ అలంకరణలకు వినియోగించనున్నారు.
ఆకట్టుకున్న శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగు
శ్రీవారి ఆలయం వద్ద శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో దాత సహకారంతో దీన్ని ఏర్పాటుచేశారు.
వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం
వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది.ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. కాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







