తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- January 09, 2026
హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (RTA) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకునే అవకాశం కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణను అమలు చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విధానం అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ విధానం ప్రకారం, వాహన డీలర్లే కొనుగోలుదారుడి నుంచి అవసరమైన పత్రాలను — ఇన్‌వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా వివరాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం — సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఆ పత్రాలను డిజిటల్ విధానంలోనే పరిశీలించి అనుమతి ఇస్తారు. అనంతరం వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించి, ఆర్‌సీ కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్టులో పంపిస్తారు.
ఈ కొత్త విధానం ద్వారా ప్రజల సమయం ఆదా కావడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాలపై ఉండే భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండే అవినీతికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత వినియోగానికి కొనుగోలు చేసే కొత్త కార్లు, మోటార్‌సైకిళ్లకే పరిమితం అవుతుంది. కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే కొనసాగుతాయి. ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసే వారు రవాణా శాఖ కొత్త సిరీస్ విడుదల చేసే వరకు వేచిచూడాల్సి ఉంటుంది.
తెలంగాణలో ప్రతిరోజూ సగటున సుమారు 3,000 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్న నేపథ్యంలో, ఈ విధానం అమల్లోకి వస్తే లక్షలాది వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్’, ‘సారథి’ పోర్టళ్లను పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. డీలర్ల వద్ద వాహనాల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం మాత్రం రవాణా శాఖ వద్దే ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం







