NATS బోర్డు నూతన చైర్మన్ కిషోర్ కంచర్ల ప్రస్థానం పై ప్రత్యేక కథనం..

- January 10, 2026 , by Maagulf
NATS బోర్డు నూతన చైర్మన్  కిషోర్ కంచర్ల ప్రస్థానం పై ప్రత్యేక కథనం..

అమెరికా: సంపాదించడం అంటే కేవలం డబ్బు మాత్రమే సంపాదించడం కాదు. విజ్ఞానాన్ని సంపాదించడం..మన కోసం పనిచేసే మనుషులను సంపాదించడం.. సమాజంలో మనుషుల ప్రేమను సంపాదించడం అనేది ఎప్పుడూ పాటిస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిలువెత్తు సాక్ష్యం కిషోర్ కంచర్ల..! ఐటి రంగాన్నే పునాదిగా చేసుకుని, అమెరికాలో 'బిర్యానీ సామ్రాజ్యాన్ని' నిర్మించి, వందల కోట్ల విలువైన వ్యాపారాలను సృష్టించిన కిషోర్ కంచర్ల.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంలో ఇటు సేవా రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. సేవా రంగంలో కిషోర్ చేసిన కృషే నేడు ఆయనకు నాట్స్ చైర్మన్ పదవి వరించేలా చేసింది.  

మూలాలు
కిషోర్ కంచర్ల ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని గుడివాడ, పామర్రు సమీపంలోని రిమ్మనపూడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పూర్ణచంద్రరావు, తల్లి విజయలక్ష్మి. కిషోర్ తండ్రి పూర్ణచంద్రరావు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా అనేక  తెలుగు సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.సినీ నేపథ్యం ఉన్నప్పటికీ, కిషోర్ విదేశాల్లో సొంతంగా ఎదగాలని కోరుకున్నారు. 2000వ సంవత్సరంలో కేవలం 110 డాలర్లతో అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. ఒక కొత్త దేశం, పరిమిత వనరులు.. కానీ ఆయన దగ్గర ఉన్నది రెండే. కష్టపడే తత్వం మరియు పట్టుదల. అవే పెట్టుబడిగా ఒక్కో అడుగు ముందుకు వేశారు.

ఐటి కెరియర్ నుండి బిజినెస్ దిశగా..
మొదట ఐటి రంగంలో బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగంలో చేరిన కిషోర్, అక్కడ తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు సేల్స్ మరియు మార్కెటింగ్‌లో పనిచేశారు. ఆ సమయంలో ఆయన రోజుకు 18 గంటలు కష్టపడేవారు., ఫలితంగా తన కంపెనీలో 'నెంబర్ వన్ సేల్స్ ప్రొడ్యూసర్'గా నిలిచారు. ఈ అనుభవమే ఆయనకు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో నేర్పింది.

బావర్చి  ఒక సంచలనం
2011లో  కిషోర్ ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. డాలస్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణం చాలా వేగంగా విస్తరించింది.కేవలం ఒక్క రెస్టారెంట్‌తో ఆగకుండా, దానిని ఒక బ్రాండ్‌గా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011 నుండి 2019 మధ్య కాలంలోనే అమెరికా అంతటా 50కి పైగా బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. అప్పట్లో నేటిలాగా సోషల్ మీడియా ప్రచారం లేకపోయినా, కేవలం 'రుచి',  'నాణ్యత'తోనే  కిషోర్ ఫుడ్ ఇండస్ట్రీలో అరుదైన విజయాలు సాధించారు. కేవలం భోజనమే కాకుండా, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ కలిపి సరికొత్త అనుభూతిని ఇచ్చే విధంగా తబలా రాసా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. కస్టమర్ల సంతృప్తే విజయానికి మూలమనేది కిషోర్‌కి బాగా తెలుసు. అందుకే ఇప్పటికీ రెస్టారెంట్‌కు వెళ్లి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ఆయన అలవాటు.

భారతీయ రుచులను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఘుమఘుమలను అమెరికన్లకు పరిచయం చేశారు. నేడు బావర్చిలో 50 రకాలకు పైగా బిర్యానీలు లభిస్తున్నాయి. ఇవే తెలుగువారికి బావర్చిని దగ్గరచేశాయి. కేవలం తెలుగువారు మాత్రమే కాదు..నేడు భారతీయులు, అమెరికన్లు కూడా ఈ బావర్చి ఫ్యాన్స్‌గా మారారు.

బహుముఖ వ్యాపారవేత్త
ఫుడ్ బిజినెస్‌లో సక్సెస్ అయ్యాక, కిషోర్ ఇతర రంగాల్లోకి కూడా ప్రవేశించారు 2020లో 'ఆర్కాన్సా వెంచర్స్' తో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టారు. అర్కాన్సా సంస్థ లో సహ వ్యవస్థాపకుడుగా, నేడు సుమారు $600 మిలియన్ల విలువైన ఆస్తులను నిర్వహించే స్థాయికి ఆర్కాన్సా వెంచర్స్ ఎదిగింది. అలాగే  మార్బుల్ మైనింగ్‌తో పాటు, పినాకిల్ సర్ఫేసెస్ , అట్లాంటా, డల్లాస్, అలబామా లలో మూడు ఐటి కంపెనీలను కూడా విజయవంతంగా నడుపుతున్నారు. ఐటీ పరిశ్రమలతో పాటు, హెల్త్ కేర్ రంగాల్లో కూడా ముందున్నారు. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

సినీ పరిశ్రమతో అనుబంధం
 కిషోర్ తండ్రి దర్శకుడు కావడంతో సినీ రంగంతో కూడా కిషోర్‌కి గాఢమైన అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు కుటుంబాలతో ఆయనకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. అలాగే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో ప్రత్యేక అనుబంధం ఉంది. లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా కోసం ఇళయరాజా స్వయంగా కిషోర్‌ని ఆహ్వానించడం  వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. అలాగే, కీరవాణి, మణిశర్మ, ఆర్.పి. పట్నాయక్, మనో వంటి ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, బి. గోపాల్ లు కిషోర్‌కి అత్యంత ఆప్తులు.. కిషోర్ కంచర్ల  తన జీవిత భాగస్వామి బిందు కంచర్ల, పిల్లలు..  గౌతమ్, హరిణి, జనని లతో గత 25 సంవత్సరాలుగా టెక్సాస్ లోని  డాలస్‌లో నివసిస్తున్నారు.

సేవే గమ్యం...
సంపాదించడమే కాదు, తిరిగి సమాజానికి ఇవ్వడం కూడా ముఖ్యమని కిషోర్ నమ్ముతారు. అదే పాటిస్తారు. కంచర్ల ఫౌండేషన్ ద్వారా తన సొంత ఊరిలో ఎల్‌ఈడీ లైట్లు, రోడ్లు వేయించడం, మహాప్రస్థానం నిర్మాణం వంటి పనులు చేశారు. 2008 నుండి ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో నాట్స్‌లో వివిధ రకాల బాధ్యతలు నిర్వహించారు. 2013, 2019 లలో డాలస్ లో అమెరికా తెలుగు సంబరాలకు ఆర్ధిక, హార్ధిక మద్దతు అందించారు. 2019 నాట్స్ తెలుగ సంబరాల కమిటీ కి చైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టి ఆనాడు సంబరాలను అద్భుతంగా నిర్వహించారు.

నాట్స్ బోర్డు లో దాదాపు పది సంవత్సరాలుగా సేవలందిస్తూ వస్తున్నారు.. ఆర్థికంగా కూడా నాట్స్ కు అండగా నిలిచారు. భారత దేశం నుండి వచ్చే ఎందరో అతిథులకు ఆత్మీయ స్వాగత సత్కారాలు అందించటంలో కిషోర్ కంచర్ల ఎప్పుడూ ముందుంటారు. 2019 లో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆహార సామగ్రిల వితరణ వంటి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు వారి కోసంఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకే నాట్స్ బోర్డ్  చైర్మన్ బాధ్యతలను నాట్స్ నాయకత్వం కిషోర్ కంచర్లకు అప్పగించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com