స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు

- January 11, 2026 , by Maagulf
స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్: స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్ (హైదరాబాద్ ఛాప్టర్) ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆధ్యాత్మికత, సంస్కృతి, సేవా భావంతో ఉత్సాహంగా సాగాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి యువతరం కంకణబద్ధులుకావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఈ సంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు.

పురాతన భారతీయ ధర్మమైన “షేర్ అండ్ కేర్” సూత్రాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనకు ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడం, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం మన జీవన విధానంలో భాగం కావాలని తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ తమ గ్రామాల్లో సేవాలయాలను ఏర్పాటు చేయడంలో ముందుకు రావాలని, ఇప్పటికే కొనసాగుతున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరారు.

పండుగ అంటే కొత్త బట్టలు, కొత్త ఆలోచనలే కాకుండా పాత అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుని, భవిష్యత్తును నిర్ణయించుకుని ముందుకు సాగడమని వివరించారు. మన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే నిజమైన ఆనందం లభిస్తుందన్నారు. పెద్దలకు గౌరవం ఇవ్వడం, కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడం అవసరమని తెలిపారు.

అలాగే ప్రకృతిలోని ప్రతి జీవితో మన ఆనందాన్ని పంచుకోవాలని, ప్రకృతిని ప్రేమించి ప్రకృతితో కలిసి జీవించాలని (Love and live with nature) పిలుపునిచ్చారు. ప్రకృతి, సంస్కృతులు కలిసినప్పుడే మేలైన భవిష్యత్తు నిర్మాణం సాధ్యమని (Nature, Culture together for better future) పేర్కొన్నారు. పదిమందికి సాయం చేయాలనే భారతీయ సంస్కృతిని భావితరాలకు తెలియజేసే మార్గాలే మన పండుగలని, ముఖ్యంగా సంక్రాంతి అందించే విస్పష్టమైన సందేశం ఇదేనని వక్తలు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com