5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!

- January 24, 2026 , by Maagulf
5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!

యూఏఈ: గుండెపోటు తరచుగా ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం లేదా చేతిలో అసౌకర్యం వంటి హెచ్చరిక సంకేతాలతో వస్తాయని భావిస్తారు. కానీ వాస్తవికత చాలా ఆందోళనకరంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. చాలాసార్లు గుండెపోటు ఎటువంటి హెచ్చరిక లేకుండానే వస్తుందని తెలిపారు. నిజానికి, గుండెపోటుతో బాధపడుతున్న చాలా మంది ప్రజలు అది జరగడానికి ముందు తాము పూర్తిగా బాగున్నామని చెబుతారని, అందుకే ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ముందస్తుగా గుండెజబ్బులను గుర్తించే అవసరం ఉందని కార్డియాలజిస్టులు అంటున్నారు.

ఐదు నిమిషాలు పట్టే, నొప్పిలేకుండా చేసే స్కాన్ గుండెపోటు రావడానికి సంవత్సరాల ముందే గుండె జబ్బులను గుర్తించడంలో సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. కరోనరీ కాల్షియం స్కోరింగ్ అని పిలువబడే ఈ పరీక్ష, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అర్టెరీస్ లో కాల్షియం పేరుకుపోవడాన్ని చూస్తుంది. ఈ కాల్షియం స్కోర్ బ్లాక్ ఏర్పడటానికి ప్రారంభ సిగ్నల్. ఇది సైలెంట్ ప్రాసెస్ అని, ఇది కాలక్రమేణా అర్టెరీస్ ను బ్లాక్ చేస్తుందని, తద్వారా అకస్మాత్తుగా గుండెపోటుకు దారితీస్తుందని RAK ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆదిల్ రిజ్వీ అన్నారు.

ఈ టెస్ట్ కు స్కాన్ నాన్-ఇన్వాసివ్ మరియు ఇంజెక్షన్లు లేదా ఆసుపత్రిలో చేరడం వంటివి అవసరం ఉండదని అన్నారు. అపాయింట్‌మెంట్ తో సహా 15 నుండి 30 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని, అయితే వాస్తవ CT స్కాన్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పడుతుందని అల్ ఐన్‌లోని NMC స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆస్టిన్ మోహన్ కొమరాన్‌చత్ తెలిపారు.  ఎటువంటి హెచ్చరిక లక్షణాలు లేకుండా గుండెపోటు రావడం ఇటీవల చాలా సాధారణమైందని పేర్కొన్నారు.  ఎకోకార్డియోగ్రామ్‌లు నార్మల్ గా ఉన్న వారిలోనూ కాల్షియం స్కోరింగ్ అధికంగా ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయని డాక్టర్ ఆస్టిన్ తెలిపారు. ఎకోకార్డియోగ్రామ్‌ నార్మల్ ఉన్న ఒక పేషంట్ కు 300 కంటే ఎక్కువ కాల్షియం స్కోరు వచ్చిందని,  కరోనరీ యాంజియోగ్రామ్ తరువాత 10 అడ్డంకులను చూపించిందని,  వాటిలో నాలుగు దాదాపు 90 శాతం బ్లాక్ అయ్యాయని తన సర్వీసులోని ఓ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి చాలా మంది ECGలు మరియు రక్త పరీక్షలపై ఆధారపడతారు. కానీ ఈ పరీక్షలు గుండెకు జరిగిన నష్టాన్ని గుర్తించడంలో విఫలమవుతాయని వైద్యులు చెప్పారు. "ECGలు ప్రధానంగా విద్యుత్ సమస్యలను గుర్తిస్తాయి. రక్త పరీక్షలు ప్రస్తుత వాపు లేదా నష్టాన్ని ప్రతిబింబిస్తాయి" అని దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ మోడరన్ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ డాక్టర్ మధుజిత్ అన్నారు.   ప్రస్తుత CT స్కానర్‌లతో చాలా తక్కువ స్థాయిల రేడియేషన్‌ను ఉపయోగించి కాల్షియం స్కోరింగ్‌ను నిర్వహించవచ్చని వైద్యులు తెలిపారు.

ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారితోపాటు అధిక రక్తపోటు, డయబెటిక్, అధిక కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఒబెసిటీ, గుండె జబ్బుల ఫ్యామిలీ హిస్టరీ లేదా దీర్ఘకాలిక ఒత్తిడి వంటి ప్రమాద కారకాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సిఫార్సు చేస్తామని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.  గుండె జబ్బులు యువత మరియు పని చేసే వయస్సు గల పెద్దలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నందున, లక్షణాలు కనిపించకముందే నివారణ ప్రారంభించాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com