మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స

- January 24, 2026 , by Maagulf
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స

హైదరాబాద్: మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లోని వైద్య నిపుణులు ఒక అరుదైన, అత్యంత ప్రమాదకరమైన గర్భసంబంధ అత్యవసర పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొని, తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ప్రాణాలను కాపాడారు. 27 వారాల గర్భంతో ఉన్న మహిళకు అపెండిక్స్ పగిలి తీవ్ర ఇన్ఫెక్షన్ (Ruptured Appendicular Abscess) ఏర్పడిన నేపథ్యంలో, సమయోచిత నిర్ణయాలు మరియు సమన్వయంతో కూడిన వైద్య చికిత్స ద్వారా ఈ క్లిష్టమైన కేసును సురక్షితంగా నిర్వహించారు.

ఈ గర్భిణీ గతంలో రెండు సార్లు గర్భస్రావం చెందిన హై-రిస్క్ వైద్య చరిత్ర (Bad Obstetric History) కలిగి ఉండటంతో పాటు, APLA పాజిటివ్‌గా గుర్తించబడింది. తీవ్ర కడుపు నొప్పి మరియు సెప్సిస్‌తో (రక్త ఇన్ఫెక్షన్) అత్యంత ప్రమాదకర స్థితిలో ఆమెను బయట ఆసుపత్రి నుంచి మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌కు రిఫర్ చేశారు. తల్లి మరియు శిశువుకు సమానంగా ప్రాణాపాయం ఉన్న పరిస్థితిలో, డాక్టర్ వరలక్ష్మి నేతృత్వంలోని హై-రిస్క్ ప్రసూతి విభాగం కేసును తక్షణమే స్వీకరించింది.

పరీక్షల అనంతరం గర్భధారణ సమయంలో అరుదుగా కనిపించే కానీ ప్రాణాంతకమైన అపెండిక్స్ రప్చర్‌గా వైద్యులు నిర్ధారించారు. ఆలస్యం జరిగితే తల్లి సెప్సిస్‌కు లోనవ్వడం, శిశువు మృతి లేదా ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉన్నందున, అన్ని విభాగాల వైద్యుల సమన్వయంతో అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

27 వారాల గర్భస్థితిలో డాక్టర్ వెంకట పవన్ అత్యంత జాగ్రత్తలతో లాపరోస్కోపిక్ అపెండికెక్టమీని విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో గర్భాశయంపై ఒత్తిడి తగ్గించడం, నియంత్రిత గాలి పీడనం, నిరంతర శిశువు హృదయ స్పందన పర్యవేక్షణ మరియు అప్రమత్తమైన అనస్థీషియా నిర్వహణ వంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా శస్త్రచికిత్స పూర్తై, గర్భధారణను సురక్షితంగా కొనసాగించారు.
శస్త్రచికిత్స అనంతరం గర్భిణీని హై-రిస్క్ ప్రసూతి విభాగం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచి, రక్తం గడ్డకట్టకుండా మందులు, థ్రాంబోప్రొఫైలాక్సిస్, తల్లి ఆరోగ్య పర్యవేక్షణ మరియు శిశువు ఎదుగుదల పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సజావుగా కొనసాగింది.

37 వారాల 4 రోజుల వద్ద శిశువుకు ఫీటల్ డిస్ట్రెస్ కనిపించడంతో అత్యవసరంగా సిజేరియన్ (LSCS) నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో శిశువు మెడకు మరియు శరీరానికి బొడ్డుతాడు గట్టిగా చుట్టుకొని ఉండటంతో పాటు అమ్నియోటిక్ ద్రవం తగ్గినట్లు గుర్తించారు. వైద్యుల సమయోచిత చర్యల వల్ల పూర్తిగా ఆరోగ్యవంతమైన శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్ మాట్లాడుతూ,
“ఇది అనేక ప్రమాదకారక అంశాలతో కూడిన అత్యంత క్లిష్టమైన గర్భధారణ. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగాము. గర్భధారణలో ఉన్నా శస్త్రచికిత్సను ఆలస్యం చేయడం ప్రమాదకరం అని ఈ కేసు నిరూపించింది” అని తెలిపారు.

డాక్టర్ వెంకట పవన్, కన్సల్టెంట్ లాపరోస్కోపిక్ & రోబోటిక్ సర్జన్ మాట్లాడుతూ,
“గర్భిణీలకు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడం అత్యంత నైపుణ్యం మరియు జాగ్రత్త అవసరమైన ప్రక్రియ. ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడమే కాకుండా గర్భస్థ శిశువుకు ఎటువంటి హాని కలగకుండా చూసుకోవడం మా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.
డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ & పీడియాట్రీషియన్ మాట్లాడుతూ,
“ముందస్తు ప్రసవం జరగకుండా నిరోధించడమే మా ప్రధాన ఆలోచన.నిరంతర శిశువు పర్యవేక్షణ వల్ల శిశువు పూర్తి గర్భకాలంతో ఆరోగ్యంగా జన్మించింది” అని తెలిపారు.
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లోని బహుశాఖ వైద్య బృందాల సమన్వయం, ఆధునిక వైద్య సదుపాయాలు మరియు రోగి కేంద్రిత వైద్య విధానం వల్ల ఇలాంటి అత్యంత క్లిష్టమైన హై-రిస్క్ కేసులను విజయవంతంగా నిర్వహించడం సాధ్యమవుతోందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com