పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు

- January 25, 2026 , by Maagulf
పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
దుబాయ్: సీబీఎస్ఈ (CBSE) బోర్డు పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. యూఏఈలోని ప్రముఖ వైద్యులు, మానసిక నిపుణుల వద్దకు వస్తున్న విద్యార్థుల్లో చాలామంది "నేను ఫెయిల్ అవుతానేమో" అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ పరీక్షల ఒత్తిడి కేవలం చదువుపైనే కాకుండా, విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడిని గుర్తించడం ఎలా? (Warning Signs)
ఆస్టర్ క్లినిక్ స్పెషలిస్ట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సల్మాన్ కరీమ్ ప్రకారం, పిల్లల్లో ఒత్తిడి ఈ క్రింది రూపాల్లో కనిపిస్తుంది:
శారీరక లక్షణాలు: తరచుగా తలనొప్పి, కడుపునొప్పి, ఆకలి తగ్గడం, నిద్రలేమి, విపరీతమైన అలసట.
మానసిక లక్షణాలు: చిరాకు, మూడ్ స్వింగ్స్, ఏడవడం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, 'నా వల్ల కాదు' అని నిరాశగా మాట్లాడటం.
వైద్యుల స్మార్ట్ స్టడీ టిప్స్:
పరీక్షల సమయంలో గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే, ప్రణాళికాబద్ధంగా చదవడం ముఖ్యమని డాక్టర్ రౌబా మనాచి (ప్రైమ్ హాస్పిటల్) సూచించారు.
1. 50-10 సూత్రం: 50 నిమిషాలు చదివిన తర్వాత, తప్పనిసరిగా 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఆ సమయంలో కాసేపు అటు ఇటు నడవాలి.
2. యాక్టివ్ లెర్నింగ్: కేవలం బట్టీ పట్టకుండా మైండ్ మ్యాప్స్ (Mind Maps), ఫ్లాష్ కార్డ్స్ వాడటం లేదా తోటి విద్యార్థులతో చర్చించడం ద్వారా గుర్తుంచుకోవడం సులభం అవుతుంది.
3. హాబీలకు సమయం: రోజుకు కనీసం 20 నిమిషాలు సంగీతం వినడం లేదా మీకు నచ్చిన పని చేయడం వల్ల మెదడు ఉల్లాసంగా ఉంటుంది.
 
జీవనశైలిలో మార్పులు తప్పనిసరి:
నిద్ర: టీనేజర్లు రోజుకు 8 నుండి 10 గంటలు నిద్రపోవాలి. నిద్ర తగ్గితే ఏకాగ్రత దెబ్బతింటుంది. తెల్లవార్లూ చదవడం (All-nighters) వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ.
ఆహారం: పౌష్టికాహారం తీసుకోవాలి. కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్కు దూరంగా ఉండాలి.
స్క్రీన్ టైమ్: సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలి. నిద్రపోవడానికి గంట ముందు ఫోన్ను పక్కన పెట్టేయాలి.
 
తల్లిదండ్రులకు సూచనలు:
పిల్లలను ఇతరులతో పోల్చడం ఆపాలని డాక్టర్ మనాచి హితవు పలికారు.
పిల్లల మార్కుల కంటే వారి శ్రమను గుర్తించి ప్రోత్సహించండి.
వారి ఆందోళనలను వినండి, జడ్జ్ చేయకుండా వారికి తోడుగా ఉండండి.
ప్రొఫెషనల్ హెల్ప్ ఎప్పుడు అవసరం?
ఒకవేళ విద్యార్థికి పానిక్ అటాక్స్ రావడం, విపరీతమైన విచారం, ఆత్మహత్య వంటి ఆలోచనలు కలగడం లేదా ఆందోళన వల్ల రోజువారీ పనులు చేసుకోలేకపోవడం వంటివి జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్ లేదా కౌన్సిలర్ను సంప్రదించాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) మరియు రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా విద్యార్థులను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావచ్చని వైద్యులు చెబుతున్నారు.
 
--బాజీ షేక్(యూఏఈ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com