జక్కన్న : రివ్యూ

- July 29, 2016 , by Maagulf
జక్కన్న : రివ్యూ

నటీనటులు : సునీల్‌.. మన్నారా చోప్రా.. నాగినీడు.. కబీర్‌ఖాన్‌.. సత్య ప్రకాష్‌.. రాజా రవీందర్‌.. పృథ్వీ.. సూర్య.. అదుర్స్‌ రఘు తదితరులు చాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌ సంగీతం: దినేష్‌ కూర్పు: ఎం.ఆర్‌.వర్మ మాటలు: భవానిప్రసాద్‌ నిర్మాత: ఆర్‌.సుదర్శన్‌రెడ్డి దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ సంస్థ: ఆర్‌.పి.ఎ.క్రియేషన్స్‌ విడుదల: 29-07-2106
సునీల్‌ అనగానే ప్రేక్షకులు కామెడీని ఆశిస్తారు. హాస్యనటుడి నుంచి కథానాయకుడిగా హోదా పెరిగినప్పటికీ ప్రేక్షకులు సునీల్‌ సినిమాలకి నవ్వుకోడానికే వెళతారు. తొలి అడుగుల్లో సునీల్‌ కూడా ఆ లెక్క ప్రకారమే సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత బండి గాడి తప్పినట్టు అనిపించింది. సునీల్‌ సినిమాల్లో డ్యాన్స్‌లు.. ఫైట్లు గట్రా అన్నీ ఉంటాయి తప్ప కామెడీనే కరువైందనే అభిప్రాయాలు వినిపించాయి. అందుకే కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. 'కృష్ణాష్టమి' పరాజయం తర్వాత చేసిన 'జక్కన్న'తోనైనా తనదైన హాస్యంతో సునీల్‌ నవ్వించాడో లేదో తెలుసుకొందాం పదండి.
 
కథేంటంటే...?: ఓ బడిపంతులు (నాగినీడు) కొడుకు గణేష్‌ (సునీల్‌). చిన్నప్పుడు తరగతి గదిలో తన తండ్రి చెప్పిన ఓ నీతి కథ ప్రకారం తనకి సాయం చేసినవాళ్లని గుర్తు పెట్టుకొని మరీ తిరిగి సాయం చేస్తుంటాడు. ఎదుటివాళ్లు 'నీ సాయం వద్దురా బాబోయ్‌' అన్నా అతను మాత్రం వదిలిపెట్టడు. చిన్నప్పుడు ఓ రౌడీ (జీవీ) చేతిలో నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు గణేష్‌. తను ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మరో రౌడీ బైరాగి (కబీర్‌ఖాన్‌) అని తెలుసుకుంటాడు.
అతన్ని మనసులో పెట్టుకొని మరీ పెద్దయ్యాక తిరిగి సాయం చేయడానికి సిద్ధమవుతాడు. బైరాగిని చంపాలనుకొన్న రౌడీలని ఓ కంట కనిపెడుతూ తన ప్రాణాల్ని అడ్డేస్తుంటాడు. అదే సమయంలో బైరాగి చెల్లెలి(మన్నారా చోప్రా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే అప్పటిదాకా బైరాగి ఎవరో బయటి ప్రపంచానికి తెలియదు. గణేష్‌ కారణంగా అందరికీ తెలిసిపోతుంది. పోలీసులు వెంటపడతారు. దీంతో గణేష్‌ని చంపాలని అనుకుంటాడు బైరాగి. తనకి సాయం చేస్తూ వచ్చిన గణేష్‌ని చంపాడా? తనని చంపాలనుకొన్నా బైరాగికి గణేష్‌ సాయంగా నిలిచాడా? లాంటివి తెలుసుకోవాలంటే వెండితెర మీదనే చూడాలి.
ఎలా ఉందంటే?: ఇటీవల కాలంలో సునీల్‌ చేసిన చిత్రాల్లాగే సగటు మాస్‌ హీరోల సినిమాలకి ఏమాత్రం తగ్గని విధంగా ఇందులోనూ ఫైట్లు, పాటలు ఉన్నాయి. అయితే.. అందరూ సునీల్‌ నుంచి ఆశించే కామెడీనే లేదు. బోలెడంత మంది నటులు.. పంచ్‌ డైలాగులు.. ప్రాసలు.. ఇలా దేనికీ లోటు లేని సినిమాలో కామెడీనే పండలేదు. ఎంచుకొన్న నేపథ్యం కొత్తదే కావొచ్చు కానీ, ఒక చిన్న లైన్‌లా అనిపించే కథని తీసుకొని దాన్ని రెండున్నర గంటలు లాగడమే ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది.
తెరపై ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి వూహకు తగ్గట్టుగానే సాగుతుంటుంది. వినోదం కోసం నటీనటులు బోలెడు పంచ్‌ డైలాగులు వేస్తున్నా వాటి లక్ష్యం మాత్రం నెరవేరదు. తొలి సగం టైమ్‌పాస్‌లా సాగటం.. బైరాగిని వెతికే క్రమంలో కథానాయిక పరిచయం కావడం.. ఆపై టీజింగ్‌ సన్నివేశాలు.. డ్యూయెట్లు.. ఆమె కరాటే నేర్చుకొనే చోట స్టంట్‌ మాస్టర్‌గా బిల్డప్‌ ఇచ్చే టీ మాస్టర్‌ (సప్తగిరి) నేపథ్యంలో సగం సినిమా పూర్తవుతుంది. బైరాగి ఎవరన్నది తెలిశాకే అసలు కథ మొదలవుతుంది. అందరూ పేరు చెబితేనే భయపడిపోయే రౌడీ ప్రాణాల్ని ఓ సామాన్యుడు కాపాడే వైనం లాజిక్‌కు అందదు.
ఎవరెలా చేశారంటే?: సరదాగా సాగే గణేష్‌ పాత్రలో సునీల్‌ చక్కగా ఒదిగిపోయారు. తన వంతుగా దర్శకుడు చెప్పింది చేసుకొంటూ వెళ్లాడు. డ్యాన్సుల్లోనూ.. ఫైట్లలో మరోసారి తన ప్రతిభని ప్రదర్శించాడు. సీఐ కట్టప్పగా పృథ్వీ కాసేపు నవ్వులు పండిస్తాడు. హీరో బాలకృష్ణ తరహాలో డైలాగులు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. కుంగ్‌ఫూ మాస్టర్‌ పాత్రలో సప్తగిరి నవ్వించాలని చాలా ప్రయత్నించాడు. కథానాయిక మన్నారా చోప్రా కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. కబీర్‌ఖాన్‌.. సత్య ప్రకాష్‌.. అదుర్స్‌ రఘు తదితరులు వారి వారి పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు.
సాంకేతికంగా సినిమాకి ఎక్కువ మార్కులే పడతాయి. రాం ప్రసాద్‌ కెమెరా పనితనం బాగుంది. విదేశీ లొకేషన్లలో తెరకెక్కించిన కొన్ని గీతాల్ని తీసిన విధానం బాగుంది. దినేష్‌ సంగీతం పర్వాలేదు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల కథ, కథనాల విషయంలో మరికొంత కసరత్తు చేయాల్సింది. భవానీ ప్రసాద్‌ భారీస్థాయిలోనే ప్రాసలు.. పంచ్‌ డైలాగులు రాశారు.
బలాలు + సంభాషణలు + ఛాయాగ్రహణం
బలహీనతలు - చిన్న కథ - కామెడీ లేకపోవడం
చివరిగా.. 'జక్కన్న' శిల్పాన్ని ఇంకా చెక్కాల్సింది
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com