మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్

- January 26, 2026 , by Maagulf
మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్

ముంబై: వారంలో ఐదు పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు.ఈ మేరకు జనవరి 23న బ్యాంకు ఉద్యోగ సంఘాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి.బ్యాంకింగ్ రంగంలో పని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఐదు వర్కింగ్ డేస్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై ఇటీవల చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. చర్చలు విఫలమవడంతో సమ్మెను వాయిదా వేసే అవకాశం లేదని యూనియన్లు స్పష్టం చేశాయి. దీంతో మంగళవారం జరగనున్న బ్యాంక్ బంద్ యథావిధిగా కొనసాగుతుందని తెలుస్తోంది.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ కస్టమర్లకు ముందస్తు సమాచారం అందిస్తూ, బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చని హెచ్చరించాయి. నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఖాతా సంబంధిత సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని బ్యాంకులు వెల్లడించాయి.

బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రకారం, వారానికి ఐదు పని దినాల విధానం అమలైతే ఉద్యోగుల ఆరోగ్యం, పని సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ విధానం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యూనియన్లు స్పష్టం చేయడంతో, రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com