తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు

- January 26, 2026 , by Maagulf
తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ పతకాల్లో తెలంగాణ (TG) రాష్ట్రం ప్రత్యేకతను చాటింది.రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది సిబ్బంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే ‘శౌర్య పతకం’ ఈ ఏడాది తెలంగాణ (TG) నుంచి ఒక్కరికే దక్కింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మర్రి వెంకట్‌రెడ్డి, తన ప్రాణాలను పణంగా పెట్టి చూపిన సాహసానికి గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని ద‌క్కించుకున్నారు.

పోలీస్ విభాగంలో అత్యున్నతమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను ఇద్దరు అధికారులకు వరించాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW) అదనపు ఎస్పీ మంద జీఎస్ ప్రకాశ్ రావు, సీఐ విభాగం ఎస్సై అను దామోదర్ రెడ్డి ఈ గౌరవాన్ని పొందారు. వీరితో పాటు వివిధ విభాగాల్లో నిరుపమాన సేవలు అందించిన మరో 12 మంది పోలీసు అధికారులకు ఉత్తమ సేవా పతకాలు దక్కాయి. ఇందులో ఐజీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు అందరికీ ప్రాతినిధ్యం లభించడం విశేషం.

ఈ పురస్కారాలు కేవలం పోలీసులకే పరిమితం కాలేదు. అగ్నిమాపక, జైళ్లు, హోంగార్డుల విభాగాల్లోని సిబ్బంది సేవలకు కూడా గుర్తింపు లభించింది. ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు జైళ్ల శాఖ అధికారులు, ముగ్గురు హోంగార్డులు కేంద్ర పతకాలు అందుకున్న వారిలో ఉన్నారు. ముఖ్యంగా కఠినమైన శిక్షణకు, సాహసోపేతమైన ఆపరేషన్లకు పేరుగాంచిన గ్రేహౌండ్స్ విభాగంలోని హోంగార్డులకు పతకాలు రావడం వారి అంకితభావానికి నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సిబ్బంది చూపుతున్న ప్రతిభకు ఈ పురస్కారాలు ఒక గుర్తింపు అని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పతక విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

ఉత్తమ సేవాపతకం: పోలీసు విభాగం.. బడుగుల సుమతి, ఐజీ, ఎస్సైబీ; అట్లూరి భానుమూర్తి, సీనియర్‌ కమాండెంట్, టీజీఎస్పీ 8వ బెటాలియన్, కొండాపూర్‌; పగుంట వెంకట రాములు, కమాండెంట్, టీజీఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల; మొగిలిచర్ల శంకర్‌రెడ్డి, డీఎస్పీ, సీఐడీ; తుమ్మల లక్ష్మి, డీఎస్పీ, పీటీసీ, అంబర్‌పేట; బుర్ర ఎల్లయ్య, ఎస్సై, వేములవాడ; కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్, హైదరాబాద్‌; సి.వంశీమోహన్‌రెడ్డి, డీఎస్పీ, పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌; వి.పురుషోత్తంరెడ్డి, ఆర్‌ఐ, టీజీఎస్పీ, 5వ బెటాలియన్, ములుగు; బొడ్డు ఆనందం, ఏఎస్సై, పెద్దపల్లి; పైలి మనోహర్, హెడ్‌కానిస్టేబుల్, ఎస్పీఎఫ్‌; సయ్యద్‌ అబ్దుల్‌ కరీం, ఎస్సై, సీఐ సెల్‌.

హోంగార్డులు: రవి మసరాం, గ్రేహౌండ్స్‌; జంగయ్య పిట్టకల, గ్రేహౌండ్స్‌; జైళ్లశాఖ: సుధాకర్‌రెడ్డి మూలగుండ్ల, డిప్యూటీ జైలర్‌; రేణుక బుర్రనోళ్ల, గ్రేహౌండ్స్‌; అశోక్‌ కుమార్‌ కురిమిండ్ల, అసిస్టెంట్‌ డిప్యూటీ జైలర్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com