చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త

- January 26, 2026 , by Maagulf
చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త

న్యూ ఢిల్లీ: చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ఇప్పటికే పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు పొందిన వ్యాపారులకు ఇప్పుడు ‘స్వనిధి క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే అవకాశం కలుగుతుంది.

పీఎం స్వనిధి స్కీమ్‌లో భాగంగా రెండో విడత రుణాన్ని తీసుకుని, సకాలంలో చెల్లించిన చిరు వ్యాపారులే ఈ క్రెడిట్ కార్డుకు అర్హులు. ఇది పూర్తిగా UPI లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డు, దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఒక్కో వ్యాపారి రూ.30,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. ఈ కార్డు 5 సంవత్సరాల వ్యాలిడిటీతో అందించబడుతుంది.

స్వనిధి క్రెడిట్ కార్డు పొందాలంటే, ముందుగా రుణం మంజూరు చేసిన సంబంధిత బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు అర్హతలను పరిశీలించి కార్డును జారీ చేస్తుంది. ఈ పథకం ద్వారా వ్యాపారులకు తక్షణ ఆర్థిక సహాయం అందడంతో పాటు, నగదు అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 7,020 మంది చిరు వ్యాపారులు ఈ క్రెడిట్ కార్డుకు అర్హత సాధించారు. విజయవంతమైతే, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com