ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!

- January 27, 2026 , by Maagulf
ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!

విజయవాడ: విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి.పశ్చిమ బైపాస్‌లో ఒకవైపు వాహనాలను అనుమతించడంతో ట్రాఫిక్ నుంచి ఊరట దక్కింది. మహానాడు కూడలితో పాటుగా స్క్యూ వంతెన దగ్గర వాహనాల రద్దీ తగ్గింది. వెస్ట్ బైపాస్ రెండో వైపు పనులు పూర్తయితే విజయవాడపై మరింత ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఆటోనగర్‌కు వెళ్లే భారీ వాహనాలను నగరంలోకి రాకుండా.. వాటికి సమయాలు నిర్దేశిస్తే ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి నుంచి పశ్చిమ బైపాస్‌పై గుంటూరు జిల్లా కాజ దగ్గర రాకపోకలు ప్రారంభించారు.

గుంటూరు నుంచి హైదరాబాద్, ఏలూరు వెళ్లే వాహనాలు విజయవాడలోకి రావడం లేదు. పోలీసులు వాహనాలను కాజ దగ్గర మళ్లిస్తున్నారు. అప్పటి నుంచి నగరంలో వాహనాల రద్దీ తగ్గింది. సాధారణ రోజుల్లో వారధి నుంచి ఎనికేపాడు వరకు వాహనాలు నిలిచిపోయేవి.. ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. సెలవులు, ఆదివారాల్లో అయితే ఆ రద్దీ మరింత తగ్గుతోంది. పశ్చిమ బైపాస్‌తో విజయవాడలో ట్రాఫిక్‌‌ ఫ్రీ జర్నీకి సానుకూలంగా ఉంటోంది.

ప్రస్తుతం ఏలూరు నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలకు కాజ దగ్గర రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నారు. చినఆవుటపల్లి దగ్గర పశ్చిమ బైపాస్‌లోకి వెళ్లాల్సిన వాహనాలను విజయవాడ నగరంలోకి మళ్లించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ మార్గంలో కూడా బైపాస్ పనులు పూర్తయితే పరిస్థితి మెరుగుపడుతుంది. 

వివిధ ప్రాంతాల నుంచి నిత్యం విజయవాడ ఆటోనగర్‌కు భారీ వాహనాలు వస్తుంటాయి. అయితే, ఈ వాహనాలు ఎప్పుడు నగరంలోకి రావాలి ఎప్పుడు వెళ్లాలి అనేది స్పష్టమైన సమయాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బైపాస్ రోడ్డు రెండో వైపు పనులు కూడా పూర్తయితే అప్పుడు భారీ వాహనాలు ఆటోనగర్‌లోకి ఎప్పుడు అనుమతించాలో సమయాలను నిర్ణయించే అవకాశం ఉంది. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com