అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి

- January 27, 2026 , by Maagulf
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి

న్యూ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశంలో జనసేన లోక్‌సభాపక్ష నాయకుడు బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాల పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.

డ్రగ్స్ వినియోగం, సోషల్ మీడియా నియంత్రణపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. విచక్షణ లేకుండా, విచ్చలవిడిగా సోషల్ మీడియా వినియోగం చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. అందువల్ల సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

జల్ జీవన్ మిషన్ పథకం కింద ఈ బడ్జెట్‌లో అన్ని జిల్లాలకు సమృద్ధిగా నిధులు కేటాయించాలని కోరారు. దీని ద్వారా ఏపీలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమని వెల్లడించారు.

ఇక ఆక్వా కల్చర్‌పై అమెరికా విధించిన పన్నుల ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించి ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా నిధుల కేటాయింపు, అమరావతి రాజధానికి చట్టబద్ధత వంటి అంశాలపై కేంద్ర పెద్దలతో విస్తృతంగా చర్చించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com