ఉగ్రవాద సంస్థల నుంచి మోడీకి ముప్పు..

- July 29, 2016 , by Maagulf
ఉగ్రవాద సంస్థల నుంచి మోడీకి ముప్పు..

వచ్చే ఆగస్టు 15న భారతదేశం 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి జాతీయ పతాకాన్ని ఎర్రకోటపై ఎగురవేయనున్నారు. అంతా బాగానే ఉన్నా.. ప్రధాని మోడీకి ముప్పు పెరిగిపోయిందని ఇంటెలీజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఈ నేపథ్యంలో స్వతంత్ర దినోత్సవంనాడు ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్‌లో నుంచే సందేశమివ్వాలని ప్రధాని మోడీకి సూచించాయి భద్రతా బలగాలు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత రెండేళ్లుగా సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఎలాంటి రక్షణ గోడలు లేకుండా ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తున్నారు.అయితే ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాశ్మీర్ అల్లర్లు, దేశంలోకి చొరబాట్లు పెరిగిపోతున్నాయని, డ్రోన్ల ద్వారా కూడా మోడీపై దాడి జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ దాడులు పెరిగిపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.ఆగస్ట్ 15న దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌(ఎస్పీజీ)ని అప్రమత్తం చేశాయి. దీంతో ఈసారి స్వతంత్ర దినోత్సవాలకు కనీవినీ ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని ప్రసంగాలకు బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్లను వాడుతున్నారు.అయితే మోడీ వచ్చాక ఆ సాంప్రదాయాన్ని పక్కనపెట్టారు. దీంతో రెండేళ్లుగా స్పాటర్స్‌, కమాండోస్ సాయంతో మానవ కవచాన్ని రక్షణగా ఉంచుతున్నారు. ఈసారి కూడా వ్యూహాత్మక ప్రదేశాల్లో ఇప్పటికే కమాండోలు, స్పాటర్స్‌ను రంగంలోకి దింపారు.
అయితే ఐఎస్‌తోపాటు అల్‌ఖైదా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్ ముజాహిదీన్‌లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి మోడీకి ముప్పు పెరిగిపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని భద్రతాధికారులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఐబీ సూచించింది. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com