ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్‌ నోటీసులు

- January 29, 2026 , by Maagulf
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్‌ నోటీసులు

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును విచారించగా… తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది.

గురువారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… నోటీసులు అందజేశారు.శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.వయసురీత్యా విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని…. మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.

కేసీఆర్‌ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం సిట్‌ అధికారులు అక్కడికే వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడికి వెళ్లకుండా… బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ హయాంలో కొందరు అధికారులు, నేతలు ట్యాంపింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ… విచారణ కూడా జరిపిస్తోంది. ఇందుకోసం ఇటీవలనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసింది.

సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీమ్… దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి.. విచారణ కూడా జరిపింది. అవసరమైతే మళ్లీ కూడా పిలుస్తామని… ఇటీవలే సీపీ సజ్జనార్ కూడా ప్రకటించారు. ముందుగా హరీశ్ రావుని విచారించిన సిట్… ఆ తర్వాత కేటీఆర్ ను విచారించింది. దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించింది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుని కూడా సిట్ విచారించింది. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com