రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- January 31, 2026
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సిట్ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించనున్నారు. కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. వేల సంఖ్యలో తెలంగాణ భవన్ కు తరలిరావాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చింది.
కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేయాలన్నారు. 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు చేయనున్నారు. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలన్నారు. సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌ను వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్, SIT నోటీసులు రాజకీయ కక్షసాధింపేనని విమర్శలు చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పార్టీ శ్రేణుల ఆందోళనల్లో పాల్గొనాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసులతో ఘర్షణలు వద్దని సూచించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ ఆదేశించింది. మరోవైపు తెలంగాణ భవన్ కు వచ్చే నేతలు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్. 3వేల మందికి పైగా భోజనం ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ బృందం కేసీఆర్ ను విచారించనుంది. హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో కేసీఆర్ ను సిట్ అధికారులు ఎంక్వైరీ చేయనున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ బృందం విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేతను కూడా ప్రశ్నించనున్నారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







