ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన

- February 04, 2026 , by Maagulf
ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన

దోహా: అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలపై అవగాహన పొందేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం ఖతార్ రాజధాని దోహాలో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత దోహా స్పోర్ట్స్ సిటీని మంత్రి నారాయణ బృందం సందర్శించింది.

దోహా స్పోర్ట్స్ సిటీలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్, ఆస్పైర్ అకాడమీ వంటి కీలక క్రీడా మౌలిక సదుపాయాలను మంత్రి నారాయణ సమగ్రంగా అధ్యయనం చేశారు. వివిధ రకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో అంతర్జాతీయ క్రీడలకు గమ్యస్థానంగా నిలిచిన దోహా స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి విధానాలపై ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు.

సుమారు 250 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన దోహా స్పోర్ట్స్ సిటీలో 2006 ఆసియన్ గేమ్స్ నిర్వహించబడిన సంగతి తెలిసిందే. అలాగే ఆసియాలోనే తొలి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్‌గా పేరుగాంచిన ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్ సేవల గురించి మంత్రి నారాయణ అధికారులతో వివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లానింగ్, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలపై దోహా అధికారులతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. దోహా అనుభవాన్ని అమరావతి అభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com