‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్త సైబర్ ముఠా అరెస్ట్
- February 24, 2026
హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు భారీ చర్యలకు దిగారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో 16 రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అతిపెద్ద సైబర్ ముఠాను ఛేదించారు. ఈ ఆపరేషన్ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. సజ్జనార్ వెల్లడించారు. పెట్టుబడులు, ట్రేడింగ్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ వంటి పేర్లతో అమాయకులను మోసం చేసిన నెట్‌వర్క్‌ను గుర్తించారు. మొత్తం 104 మందిని అరెస్ట్ చేయగా, 1,055 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ మోసాల విలువ సుమారు రూ.127 కోట్లు అని పోలీసులు వెల్లడించారు.
డీసీపీ (సైబర్ క్రైమ్స్) వి. అరవింద్ బాబు నేతృత్వంలో 32 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 10 రోజుల పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో సమన్వయంతో దాడులు చేపట్టారు. నిందితుల్లో 86 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు కాగా, 17 మంది ఖాతాలను సేకరించే ఏజెంట్లుగా పనిచేశారు. బాధితుల డబ్బును మళ్లించేందుకు ఉపయోగించిన 151 బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఈ దర్యాప్తులో బంధన్ బ్యాంక్ కు చెందిన ఓ రిలేషన్‌షిప్ మేనేజర్ కూడా ముఠాకు సహకరించినట్లు బయటపడింది. అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో రూ.36 లక్షల నగదు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 234 డెబిట్/క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు, 152 పాస్‌బుక్‌లు, 56 కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ముఠాలోని ప్రధాన సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేసే వరకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లకు సహకరించే బ్యాంకు సిబ్బంది, మ్యూల్ ఖాతాదారులు ఎవరైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రజలు అపరిచిత పెట్టుబడి ఆఫర్లు, భయపెట్టే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









