సినిమా రివ్యూ: ‘మృత్యుంజయ్’.!
- March 06, 2026
గత వారమే ‘విష్ణు విన్యాసం’ అంటూ సరదాని పంచిన శ్రీ విష్ణు ఇప్పుడు ‘మృత్యుంజయ్’గా థ్రిల్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్స్‌కి ప్రస్తుత కాలంలో ఆదరణ ఏ స్థాయిలో వుందో చూస్తున్నాం. అయితే, అన్ని క్రైమ్ థ్రిల్లర్ కథలూ ఆ స్థాయిలో థ్రిల్‌ని అందించడం లేదనుకోండి అది వేరే విషయం.మరి, ‘మృత్యుంజయ్’ ఏ స్థాయిలో థ్రిల్‌ని పంచిందో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
మీడియాలో ప్రకటనలు వేసుకునే ఓ మామూలు రిపోర్టర్ జయ్ (శ్రీ విష్ణు), ఎలాగైనా క్రైమ్ బ్రాంచ్‌లో రిపోర్టర్‌గా స్థానం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధించలేడు. కేవలం ప్రకటనలతోనే సరిపెట్టుకోవల్సి వస్తుంది. దాంతో ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు.. వాళ్ల ఇంటికి రక రకాల వేష ధారణల్లో వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయి.. వారి చావులకు గల కారణాలు తెలుసుకుంటాడు. తద్వారా మీడియాలో ప్రకటనలు వేస్తుంటాడు. ఈ క్రమంలోనే అచ్యుతరావు (బాలాదిత్య) చనిపోయాడని తెలుస్తుంది. అనుకోకుండా జరిగిన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని అచ్యుతరావు కూతురు.. అస్సలు ఏడవకుండా వుండిపోవడం చూసి.. తనకు తన బాల్యం గుర్తొస్తుంది జయ్‌కి. అలా ఆ పాపతో కనెక్ట్ అవుతాడు జయ్. తన తండ్రిది సాధారణ ప్రమాదం కాదనీ, దాని వెనుక ఎవరో వున్నారనీ అది కావాలని చేసిన హత్య అనీ గ్రహిస్తాడు జయ్. అది కనిపెడతానని ఆ పాపకి మాటిస్తాడు. ఈ నేపథ్యంలోనే మరో వ్యక్తి కూడా ఇదే తరహాలో చనిపోయాడని తెలుస్తుంది జయ్‌కి. ఈ అనూహ్యమైన హత్యల వెనక వున్నదెవరు.? ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారు.? అన్న యాంగిల్లో తన పరిశోధన మొదలుపెడతాడు జయ్. మరోవైపు ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురామ్ కూడా ఈ హత్యలకు వేరే కారణం వుందని గ్రహిస్తుంది. కానీ, పై నుంచి వచ్చే ఒత్తిడుల కారణంగా బలమైన ఎవిడెన్సెస్ లేని కారణంగా వాటిని ప్రమాదాలుగానే కేసు క్లోజ్ చేయాల్సి వస్తుంది. మరి, క్రైమ్ బ్రాంచ్ రిపోర్టర్ అవ్వాలన్న కోణంలో తన ఆసక్తికి తనదైన తెలివితేటలు చేర్చి, పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న జయ్‌కి ఆ హత్యల చిక్కుముడి వీడిందా.? ఈ క్రమంలో జయ్ ఎదుర్కొన్న సవాళ్లేంటీ.? తెలియాలంటే ధియేటర్లో ‘మృత్యంజయ్’ చూడాల్సందే.
నటీనటుల పనితీరు:
ఈ మధ్య శ్రీ విష్ణు అంటే కేవలం కామెడీ హీరోనే అనే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఒకప్పుడు విలక్షణ నటుడిగా విభిన్న కథలను ఎంచుకున్న శ్రీ విష్ణు కామెడీ రూట్ మార్చాక కొన్ని సక్సెస్‌లు అందుకున్నమాట వాస్తవమే. కానీ, మింగేసే డైలాగులతో అర్ధం పర్ధం లేని కాన్సెప్టులతో కొన్ని సినిమాలు బోర్ ఎత్తించేశాడన్న కామెంట్స్ కూడా ఎదుర్కోక తప్పలేదు. అయితే, ‘మృత్యుంజయ్’తో శ్రీ విష్ణులోని విలక్షణ నటుడు మళ్లీ బయటికొచ్చాడు. ఎక్కడా ఎటకారాలూ, వెకిలి డైలాగులూ లేకుండా.. చాలా ఇంటెన్స్‌గా జయ్ పాత్రలో ఒదిగిపోయాడు శ్రీ విష్ణు. రెబా మోనికా జాన్ హీరోయిన్గా ఏదో గ్లామర్ కోసం అన్నట్లుగా కాకుండా.. కేవలం పోలీసాఫీసర్‌గా మాత్రమే తన పాత్రలో తనదైన డిగ్నిటీ ప్రదర్శించేలా వుంది. ప్రతి నాయకుడి పాత్రలో వీర్ ఆర్యన్ తనదైన గంభీరాన్ని చూపించాడు. కొన్ని చోట్ల సన్నివేశానికి తగ్గట్లుగా భయపెట్టాడు కూడా. ఐశ్వర్య, రచ్చ రవి, బాలాదిత్య, సుదర్శన్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుంది.? అనే ఉత్కంఠ కలగాలి. అలాంటి ఉత్కంఠలు ఈ సినిమాలో అనేకం. అప్పుడే చిక్కు ముడి వీడిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ, మరో ముడి లింక్ పడుతుంది. తదుపరి ఏం జరగబోతుంది.? అనే ఉత్కంఠ. అచ్చం తనలాగే జీవిస్తూ.. దారుణమైన హత్యలు చేసే ప్రతినాయకుడిని వెతికి పట్టుకోవాలనుకునే కథానాయకుడు. ఈ ఇద్దరూ ఎదురు పడే సన్నివేశాలు.. ప్రేక్షకుడిలో డిఫరెంట్ థ్రిల్ క్రియేట్ చేస్తాయ్. అచ్యుతరావు కూతురు పాత్ర.. ఆ పాత్రతో హీరో కనెక్ట్ అయ్యే విధానం భావోద్వేగాల్ని కలిగిస్తుంది. సెకండాఫ్ అంతా ప్రతినాయకుడ్ని పట్టుకునే కోణంలో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ నిజంగానే సరికొత్త థ్రిల్ కలిగిస్తుంది. కథ కోసం ఎంచుకున్న అంశంతో పాటూ, ఆ కథని గ్రిప్పింగ్‌గా నడిపించిన విధానంలో డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ వందకు వంద మార్కులేయించుకున్నాడు. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. విజువల్స్ బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. ఓవరాల్‌గా ఓ క్రైమ్ థ్రిల్లర్‌ని థ్రిల్లింగ్‌గా బిగబట్టుకుని చూసేందుకు ప్రేక్షకుడికి ఏ ఏ ఎలిమెంట్స్ కావాలో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా సరైన పద్ధతిలో పేర్చి తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం, శ్రీ విష్ణు నటన, భావోద్వేగాలు, సెకండాఫ్.. క్లైమాక్స్.. ఇలా చాలానే వున్నాయ్.
మైనస్ పాయింట్స్:
పెద్దగా నోటీస్ కావు కానీ, ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కొన్ని చోట్ల బావోద్వేగాలు మిస్ అయితే అవ్వొచ్చు.. అంతే కానీ, అవి కూడా ఏమంత నోటెడ్ కావు.
చివరిగా:
శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’.! అసలు సిసలు థ్రిల్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్.!
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









