షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు

- March 07, 2026 , by Maagulf
షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు

షార్లెట్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా షార్లెట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించింది. 'ఉమెన్స్ నైట్' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి పైగా తెలుగు మహిళలు పాల్గొని సందడి చేశారు. మహిళా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ వేడుకలో బ్రెస్ట్ క్యాన్సర్ హబ్ ప్రతినిధి లోపా ముద్ర, శక్తి ఫౌండేషన్ ప్రతినిధి నిదియా గాస్పర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మహిళా సాధికారత గురించి ప్రసంగించారు.

ఈ వేడుకలో మిస్ తెలుగు యూఎస్‌ఏ ఆర్గనైజేషన్ విజేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన బ్యూటీ పీజెంట్ మరియు బెస్ట్ డ్రెస్డ్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. ప్రముఖ గాయని స్వాతి వారణాసి తన మధుర గాత్రంతో ఆలపించిన పాటలు సభికులను ఎంతగానో అలరించాయి. విభిన్న రకాల ఆటపాటలు, సంగీత విభావరితో వేడుక ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మాక్‌టైల్స్, రుచికరమైన విందు భోజనం వేడుకకు మరింత వన్నె తెచ్చాయి. మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సాహంగా జరుపుకున్న ఈ వేడుకలు నాట్స్ షార్లెట్ విభాగం యొక్క సేవా స్పూర్తిని, సంఘీభావాన్ని చాటిచెప్పాయి.. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని  కార్యక్రమాలను నిర్వహిస్తామని నాట్స్ నాయకులు తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన షార్లెట్ నాట్స్ నాయకులు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com