వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- March 29, 2026
యూఏఈ: యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత లోతట్టు ప్రాంతాలలో కార్లు పాక్షికంగా లేదా పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు చూపిస్తున్న వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల, వాహనదారులు నీటిమట్టం తగ్గే వరకు వేచి చూసి, ఆ తర్వాత వాటిని కదిలించడానికి ప్రయత్నించడంతో వాహనాలు నిలిచిపోయి కనిపించాయి. ఇలాంటి నష్టానికి బీమా వర్తిస్తుందా లేదా అనే దాని గురించి కూడా నివాసితులలో ఆందోళనలను రేకెత్తించింది.
థర్డ్-పార్టీ బీమా ఉన్న వాహనదారులు వర్షం సంబంధిత నష్టానికి క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చు. థర్డ్-పార్టీ పాలసీలు ఇతరులకు జరిగిన నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. పాలసీదారుని సొంత వాహనానికి జరిగిన నష్టాన్ని కాదు. అంటే, మరమ్మతు ఖర్చులను పూర్తిగా యజమాని భరించాల్సి రావచ్చు అని నిపుణులు తెలిపారు. వాహనం ఎంతసేపు నీటిలో మునిగి ఉంది మరియు నీటి లోతుపై నష్టం తీవ్రత ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు.
షార్జాలోని ఇండస్ట్రియల్ ఏరియా 6కు చెందిన ఆటోమొబైల్ నిపుణుడు నాసిర్ రసూల్ మాట్లాడుతూ..“ఇంజిన్ సురక్షితంగా ఉన్నప్పటికీ, నీరు ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ట్రాన్స్‌మిషన్ మరియు ఇంటీరియర్ భాగాలను దెబ్బతీయగలదు. ప్రజలు వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకుండా, వెంటనే దాన్ని తనిఖీ చేయించుకోవాలి” అని అన్నారు. కొన్ని సందర్భాల్లో, శుభ్రపరచడం మరియు ఫ్లూయిడ్స్ మార్చడం ద్వారా కారును కాపాడవచ్చు, కానీ ఇంజిన్ లేదా ECU దెబ్బతింటే, మరమ్మతులు చాలా ఖరీదైనవిగా మారవచ్చు అని ఆయన వివరించారు.
మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది?
నష్టం స్థాయిని బట్టి మరమ్మతుల ఖర్చులు చాలా తేడాగా ఉంటాయని మెకానిక్‌లు తెలిపారు. ఇంటీరియర్‌లను ఆరబెట్టడం మరియు ఫ్లూయిడ్స్ మార్చడం వంటి చిన్నపాటి పనులకు కొన్ని వందల నుండి రెండు వేల దిర్హమ్‌ల వరకు ఖర్చవవచ్చు.
ఉమ్ రామూల్‌కు చెందిన కార్జ్‌పర్ట్ ఆటో మెయింటెనెన్స్ నిపుణుడు నబీల్ అహ్మద్ మాట్లాడుతూ.. “ఎలక్ట్రికల్ సిస్టమ్స్, సెన్సార్లు లేదా వైరింగ్ దెబ్బతింటే, ఖర్చులు గణనీయంగా పెరగవచ్చు. ఇంజిన్ దెబ్బతినే తీవ్రమైన సందర్భాల్లో, ముఖ్యంగా హైడ్రోలాక్ కారణంగా, వాహనం మరియు దాని తయారీని బట్టి మరమ్మతులు లేదా భర్తీకి Dh15,000 నుండి Dh25,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు.” అని తెలిపాడు.
ఇక భీమా కవరేజ్ అనేది పాలసీ రకంపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. "కారుకు సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్) ఉంటే, నష్టాన్ని బట్టి మరియు మార్గదర్శకాలను పాటిస్తే వరద నష్టాన్ని కవర్ చేయవచ్చు. కానీ థర్డ్-పార్టీ బీమాతో అయితే, ఆ ఖర్చును యజమానే భరించాల్సి ఉంటుంది," అని ఆయన అన్నారు.
కొత్త కార్లు నష్టానికి ఎందుకు ఎక్కువగా గురవుతాయి?
ఎలక్ట్రానిక్స్ కారణంగా కొత్త కార్లు నష్టానికి ఎక్కువగా గురవుతాయని మెకానిక్ లు హెచ్చరించారు. "పాక్షికంగా నీటిలో మునిగినా కూడా సెన్సార్లు మరియు వైరింగ్‌పై ప్రభావం పడుతుంది. ప్రజలు చేసే అతిపెద్ద తప్పు కారును స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడమే. అది ఒక చిన్న సమస్యను పెద్ద ఇంజిన్ నష్టంగా మార్చగలదు," అని నబీల్ అహ్మద్ అన్నారు. వాహనాన్ని టో చేయించుకుని, తనిఖీ చేయించుకోవాలని వాహనదారులకు సలహా ఇచ్చారు.
సమగ్ర బీమా ఉన్న వాహనదారులు కూడా వర్షం సంబంధిత నష్టానికి ఎల్లప్పుడూ క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చని మెకానిక్‌లు చెప్పారు. కొన్ని పాలసీలు వరద నష్టాన్ని కవర్ చేసినప్పటికీ, అన్ని సందర్భాల్లోనూ క్లెయిమ్‌లకు హామీ ఉండదన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









