ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

- March 31, 2026 , by Maagulf
ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా అంతర్జాతీయ విమానయాన రంగ నిపుణుడు విలియం వాల్ష్‌ను నియమించింది. మంగళవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్’ (IATA) డైరెక్టర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. విలియం వాల్ష్ రాకతో ఇండిగో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పీటర్ ఎల్బర్స్ అకస్మాత్తుగా తప్పుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే ఇండిగో ఈ భారీ నియామకాన్ని ప్రకటించడం విశేషం.

విలియం వాల్ష్ (విల్లీ వాల్ష్ అని కూడా పిలుస్తారు) విమానయాన రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన వ్యక్తి. గతంలో ఆయన ‘బ్రిటిష్ ఎయిర్వేస్’ సీఈవోగా, అలాగే ‘ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్’ (IAG) వ్యవస్థాపక సీఈవోగా పనిచేసి ఆయా సంస్థలను లాభాల బాట పట్టించారు. ఎరో లింగస్ (Aer Lingus) సంస్థలో పైలట్‌గా కెరీర్ ప్రారంభించి, అదే సంస్థకు సీఈవో స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా విమానయాన సంస్థలను సమర్థవంతంగా నడిపించడంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ప్రస్తుతం ఐఏటీఏ (IATA)లో ఉన్న బాధ్యతలు జూలై 31, 2026తో ముగియనున్నాయి. అనంతరం ఆయన ఆగస్టు 3, 2026 లోపు ఇండిగో సీఈవోగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా స్పందిస్తూ.. విలియం నాయకత్వం ఇండిగోకు ఒక కొత్త అధ్యాయమని, అంతర్జాతీయ విస్తరణలో ఆయన అనుభవం ఎంతో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో ఎదురైన కార్యకలాపాల అంతరాయాల నుంచి కోలుకుని, మళ్లీ పటిష్టమైన వృద్ధిని సాధించడమే లక్ష్యంగా విలియం వాల్ష్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com