మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- April 01, 2026
అమరావతి: అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ వేశానికి ఓ నూతన దిశను అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలను తొలిగా అందిపుచ్చుకుని ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి ప్రగతి ప్రేరకంగా మారుతుందని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం హార్డ్ వేర్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీఏ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సీడాక్, సీడాట్, డీఆర్ డీఓ, నేవల్ సైన్స్ టెక్నాలాజికల్ లేబొరేటరీ, బార్క్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. క్యూబిట్ ఫోర్స్, క్యూబీట్స్, క్వాంటం ఏఐ గ్లోబల్, క్యూపిఐ ఏఐ, ఆటోమియోనిక్స్, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ సత్యనారాయణ హాజరయ్యారు.
మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ రామకోటి వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి క్వాంటం కంప్యూటర్ పరికరాల తయారీ కంపెనీలు, క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారిని ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ రెండేళ్లలో దేశీయంగా క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. త్వరలో సిద్ధం కానున్న ఏక్యూవీ నుంచి క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు, ఇతర హార్డ్ వేర్ ఉత్పత్తి, అల్గారిథమ్స్ రూపకల్పన వంటివి చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 5 గ్లోబల్ క్వాంటం హబ్స్ ఒకటిగా ఎపిని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అమరావతి క్వాంటం వ్యాలీలో దీనికి అవసరమైన మోలిక సదుపాయాల కల్పనతో పాటు హార్డ్ వేర్, ఎకోసిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయోఫౌండ్రీ సహా వివిధ స్టార్టప్ల సహకారంతో డిజైన్లు, ఆవిష్కరణలు, పరిశోధన చేపట్టాలని సమావేశంలో చర్చించారు. మేడ్ ఇన్ అమరావతి క్వాంటం కంప్యూటర్ పరికరాల ఉత్పత్తికి విస్తృత ప్రయత్నాలు చేయాలని సూచించారు.
మూడు దశాబ్దాల క్రితం ఐటీని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అందిపుచ్చు కుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గతంలో ఐటీలో నిపుణుల్ని తయారుచేయడానికి ఇంజనీరింగ్ కాలేజీ లు, ట్రిపుల్ ఐటీలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామని… ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకునేలా నిపుణులకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వైసర్, ఐబీఎం లాంటి సంస్థల సహకారంతో యువతకు క్వాంటంలో నైపుణ్యాలు పెంచుతున్నామన్నారు. ఆవేర్ ద్వారా రియల్ టైమ్ డేటా సేకరించటంతో పాటు రియల్ టైమ్ లో నిర్ణయాలు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమిస్ట్ లాంటి సేవలు పౌరులకు అందాల్సి ఉందన్నారు. ఆధునిక టెక్నాలజీ లను తొలిగా అందిపుచ్చుకున్న వారికే ఎప్పుడూ ప్రయో జనాలు దక్కుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీలో నిర్మిస్తున్న 8 టవర్లలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్తో పాటు ఆవిష్కరణలు, పరిశోధనలతో పాటు స్టార్టవ్లకు కూడా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. క్వాంటం హార్డ్ వేర్ దిగుమతి కాకుండా ఇక్కడే తయారు చేసుకోవాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియచేశారు. క్వాంటం పరికరాలు, టెక్నాలజీ, క్రయోజనిక్స్, అల్గారిథమ్స్ ఇలా మనమే తయారు చేసుకునేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీతో అమరావతి ఇక భవిష్యత్ నగరంగా అత్యుత్తమ లివబుల్ సిటీగా మారుతుందన్నారు. దీనికి అవసరమైన టెక్నాలజీని, భాగస్వామ్యాన్ని అందించాలని జాతీయ క్వాంటం మిషన్ ను ముఖ్యమంత్రి కోరారు.
ఏప్రిల్ 14న అందుబాటులోకి తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్: దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏప్రిల్ 14 తేదీ నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు క్వూబిట్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ముఖ్యమంత్రికి చంద్రబాబు వివరించారు. విద్యార్థులు, పరిశోధకులకు ఈ క్వాంటం కంప్యూటర్ టెస్టింగ్ కోసం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. క్వాంటం ఎకోసిస్టమ్కు అనువుగా టెస్ట్ బెడ్స్, సర్టిఫికేషన్ లాంటివి ఉండాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీడాక్ ఈడీ సుదర్శన్ వివరించారు.
క్వాంటం సిమ్యులేటర్స్ తో పాటు బయోసెన్సార్స్, మినరల్ సెన్సార్స్, లేజర్ ఆప్లికేషన్స్ అమరావతి క్వాంటం వ్యాలీలో అందించేందుకు సిద్ధమని వివిధ క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు ముఖ్యమంత్రికి తెలియచేశాయి. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకోవటంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఎన్ క్యూఎం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తంగా 30కి పైగా క్వాంటం కంప్యూటింగ్ వరికరాల తయారీ కంపెనీలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాయి. 15 కంపెనీలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. విజయవాడలోని మేధా టవర్స్లో 7 సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్‌కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









