NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- April 01, 2026
అమెరికా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఎడిసన్ టౌన్‌షిప్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాఫీ విత్ కాప్స్ పేరిట అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్, ఎడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ‘కాఫీ విత్ కాప్స్’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాయి.ఈ సదస్సు కేవలం సమాచార మార్పిడికే పరిమితం కాకుండా, రక్షణ వ్యవస్థకు, సామాన్య పౌరులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పటానికి దోహదపడింది.
సాధారణంగా ప్రజలు ఏదైనా ఆపద కలిగినప్పుడో లేదా నేరం జరిగినప్పుడో మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తుంటారు.కానీ, నేరం జరగక ముందే అప్రమత్తంగా ఉండటం ద్వారా ముప్పులను ఎలా అరికట్టవచ్చో ఈ సమావేశంలో ఎడిసన్ పోలీస్ డిటెక్టివ్‌లు క్రిస్ డిపాలో, చాంగ్ లు వివరించారు. ముఖ్యంగా వలసదారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో సైబర్ మోసాలు, యూటిలిటీ స్కామ్‌లు, ఇమ్మిగ్రేషన్ పేరుతో జరిగే బెదిరింపులు అధికమవుతున్న తరుణంలో, ఈ సదస్సు స్థానిక తెలుగు వారికి ఎంతో భరోసానిచ్చింది. ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా వచ్చే అపరిచిత సందేశాల పట్ల ఎలా వ్యవహరించాలో, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలో అధికారులు సోదాహరణంగా వివరించారు.
సమాజ శ్రేయస్సు కోరి నాట్స్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని నాట్స్ బోర్డు సభ్యులు బిందు యలమంచిలి,టి.పి.శ్రీనివాస్ గుర్తు చేశారు.నాట్స్ కేవలం పండుగలు, వేడుకలకే పరిమితం కాకుండా, నివాసితుల భద్రత, చట్టపరమైన అవగాహన కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి పేర్కొన్నారు. ఎడిసన్ మేయర్ సామ్ జోషి, పోలీస్ చీఫ్ టామ్ బ్రయన్ అందిస్తున్న సహకారం వల్ల ఇక్కడ నివసిస్తున్న భారతీయులకు రక్షణ వ్యవస్థపై నమ్మకం పెరుగుతోందని వెల్లడించారు.
సురక్షితమైన టౌన్‌షిప్ నిర్మాణం అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సదస్సు స్పష్టం చేసింది. ఏదైనా అనుమానాస్పద స్థితి ఎదురైనప్పుడు భయం వీడి పోలీసులను సంప్రదించాలని, కమ్యూనిటీ పోలీసింగ్ యూనిట్ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సదస్సు ద్వారా అందిన విలువైన సూచనలు, జాగ్రత్తలు ఒకరికొకరు పంచుకోవడం ద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మించవచ్చని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎడిషన్ లో కాఫీ విత్ కాప్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు.
తాజా వార్తలు
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బహ్రెయిన్ మత వైవిధ్యం..!!
- 'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు









