తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం

- April 03, 2026 , by Maagulf
తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం

24 జట్లు, 23 మ్యాచ్‌లు, అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరిత పోటీలు

దుబాయ్: యూఏఈలోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో “తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్–సీజన్ 3–2026” (TACL Season 3 – 2026) ను మార్చి 15, 2026న ఉమ్ అల్ కువైన్ ఎమిరేట్‌లోని యూనికార్న్ క్రీడా ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.మొదటగా మార్చి 1న జరగాల్సిన ఈ టోర్నమెంట్, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెండు వారాలు వాయిదా వేసి ఘనంగా నిర్వహించబడింది.

టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్లకు సంబంధించిన టీషర్ట్‌లను దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA) నుంచి విచ్చేసిన అధికారులు మసూద్ అల్ బలూషి, అబ్దుల్లా అల్ మన్సూరి, అబ్దుల్లా సామె చేతుల మీదుగా ఆవిష్కరించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా యూఏఈ తెలుగు సమాజం ప్రదర్శించిన ధైర్యం, క్రమశిక్షణ, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని వారు ప్రత్యేకంగా అభినందించారు.

యూఏఈలోని అన్ని ఎమిరేట్స్ నుంచి తెలుగు క్రీడాభిమానులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 500 మందికి పైగా నిర్వాహకులు, ఆటగాళ్లు, అభిమానులు హాజరుకావడంతో యూనికార్న్ ప్రాంగణం సందడిగా మారింది. ప్రభుత్వ భద్రతా చర్యలపై పూర్తి నమ్మకంతో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.

ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన టోర్నమెంట్, అర్ధరాత్రి 1 గంట వరకు సాగింది. పోటీలు T10 ఫార్మాట్‌లో నిర్వహించగా, మొత్తం 24 జట్లు పాల్గొని 5 నాకౌట్ దశల్లో 23 మ్యాచ్‌లు ఆడాయి. ఒకేసారి 6 మైదానాల్లో పోటీలు నిర్వహించడం ద్వారా తెలుగు అసోసియేషన్ తమ కార్యనిర్వహణ సామర్థ్యాన్ని అద్భుతంగా చాటింది.

మొదటి నాకౌట్ దశలో 12 మ్యాచ్‌లు, రెండో దశలో 6 మ్యాచ్‌లు, మూడో దశలో 3 మ్యాచ్‌లు జరిగాయి. మూడో దశలో అత్యధిక రన్‌రేట్ నమోదు చేసిన ఆంధ్రా వారియర్స్ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. మిగతా రెండు జట్లైన DGA రాయల్స్ మరియు మరో జట్టు మధ్య జరిగిన ప్రీ-ఫైనల్‌లో DGA రాయల్స్ విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

చివరగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో దుబాయి నుంచి వచ్చిన DGT రాయల్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆంధ్రా వారియర్స్ జట్టు మొదటి రన్నరప్‌గా, కిరాక్ తెలుగు బాయ్స్ జట్టు రెండో రన్నరప్‌గా నిలిచాయి.

టోర్నమెంట్ మొత్తం ప్రదర్శన ఆధారంగా పలువురు క్రీడాకారులను ప్రత్యేక ట్రోఫీలతో సత్కరించారు. ఫైనల్ మ్యాచ్‌లో DGT రాయల్స్ జట్టుకు చెందిన అనిల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నారు. కిరాక్ తెలుగు బాయ్స్ జట్టుకు చెందిన జంగ్లీ “మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్”తో పాటు “బెస్ట్ బ్యాట్స్‌మన్” అవార్డును కూడా గెలుచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే జట్టుకు చెందిన రాజు యాదవ్ “బెస్ట్ బౌలర్” అవార్డును, DGT రాయల్స్ జట్టుకు చెందిన రమాకాంత్ “బెస్ట్ ఫీల్డర్” అవార్డును అందుకున్నారు.

ఈ టోర్నమెంట్ విజయవంతానికి REITZ Middle East మరియు Diamond Land Properties సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా సహకరించగా, లెమన్ స్టూడియో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కవరేజ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించింది.

ఈ భారీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో తెలుగు అసోసియేషన్ క్రీడా విభాగ డైరెక్టర్ రాజీవ్ చింతకాయల, అసోసియేట్ డైరెక్టర్ నెల్సన్ కీలక పాత్ర పోషించారు.వీరికి తోడుగా చైర్మన్ మసివుద్దీన్, వైస్ చైర్మన్ సుదర్శన్, జనరల్ సెక్రటరీ దినేష్ ఉగ్గిన, కల్చరల్-కమ్యూనిటీ డైరెక్టర్ శ్రీధర్, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేద్కర్, అసోసియేట్ డైరెక్టర్ లత, వర్కింగ్ కమిటీ సభ్యులు ఉష,తౌఫీక్,మోహన కృష్ణ తదితరులు విశేష సహకారం అందించారు.

మొత్తం మీద, ఈ టోర్నమెంట్ యూఏఈ తెలుగు సమాజం ఐక్యతకు, క్రీడాస్ఫూర్తికి, కార్యనిర్వహణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com