యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ

- April 05, 2026 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మరియు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఆదివారం అబుదాబిలో కీలక భేటీ జరిగింది. ఇటలీ ప్రధాని యూఏఈ పర్యటన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ పరిణామాలు, భద్రతా పరిస్థితులు, సముద్ర రవాణా భద్రత, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాల పై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా యూఏఈతో పాటు ప్రాంతంలోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇరాన్ దాడులు, పౌరులు మరియు పౌర మౌలిక వసతులపై దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారాయని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఇవి సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని పేర్కొన్నారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ దాడులను ఖండిస్తూ, యూఏఈ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలకు ఇటలీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

భేటీలో యూఏఈ–ఇటలీ మధ్య ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అంశాల పై కూడా చర్చించారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి, ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఇరు నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ సమావేశానికి షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్,షేక్ మొహమ్మద్ బిన్ హేమాడ్ బిన్ తనూన్ అల్ నహ్యాన్   తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com