Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్‌ బస్ట్..!!

- April 11, 2026 , by Maagulf
Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్‌ బస్ట్..!!

యూఏఈ: ఫేక్ SMS స్కామ్ మెసేజుల ద్వారా నివాసితులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక క్రాస్-ఎమిరేట్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తును ప్రారంభించింది. టోల్ గేట్లను చెల్లించకుండా దాటినందుకు విధించే చిన్న ట్రాఫిక్ జరిమానాలను పరిష్కరిస్తామని చెప్పే ఈ స్కామ్.. బాధితులు తమ బ్యాంకు ఖాతాల నుండి పెద్ద మొత్తాలను కోల్పోయేలా చేస్తోంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మోసపూరిత పథకంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు రాయితీ చెల్లింపులు (తరచుగా 4 దిర్హమ్‌ ల కంటే తక్కువగా) ఇస్తామని పేర్కొంటూ లింక్‌లతో కూడిన మెసేజులను పంపడం జరిగింది. ఆ లింక్‌పై క్లిక్ చేసి, తమ బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేసిన బాధితులు, ఆ తర్వాత తమ ఖాతాల నుండి అనధికారికంగా పెద్ద మొత్తాలు డెబిల్ అయినట్లు గుర్తించారు. 

ఈ క్రమంలో ఫిర్యాదులు పెరగడంతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడంతోపాటు బాధితుల నుండి ఆధారాలు సేకరించడం ద్వారా అజ్మాన్‌లోని ఒక నివాస అపార్ట్‌మెంట్ నుండి పనిచేస్తున్న ఒక క్రిమినల్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను దర్యాప్తు అధికారులు గుర్తించారు.   

మోసం చేసే విధానం

నిందితులు దొంగిలించిన బ్యాంక్ కార్డ్ డేటాను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. వారి అపార్టుమెంట్ నుంచి 22 ఎలక్ట్రానిక్ పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విదేశాలలో నివసిస్తున్న ఒక పాకిస్తానీ జాతీయుడు నడిపిస్తున్న ఒక పెద్ద నేర నెట్ వర్క్ లో అనుమానితులు భాగమని దర్యాప్తులో వెల్లడైంది. అతను దొంగిలించిన బ్యాంక్ కార్డ్ వివరాలను షేర్ చేయడంతో పాటు షార్జా మరియు అజ్మాన్‌లలో ఏర్పాటు చేసిన ఫ్రాడ్ కంపెనీలు మరియు బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి బాధితులను మోసం చేస్తున్నారు.

బాధితులను మోసగించి నకిలీ టోల్ గేట్ జరిమానాలు చెల్లించేలా చేయడానికి ఫేక్ SMS లు పంపడం, బినామీ కంపెనీలను స్థాపించడం, ఆర్థిక మోసాలకు పాల్పడటానికి మరియు అక్రమ నిధుల తరలింపును దాచిపెట్టడానికి బ్యాంకు ఖాతాలు తెరవడం వంటివి ఈ ముఠా అనుసరించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.

ఈ కుంభకోణానికి సంబంధించి వివిధ ఎమిరేట్‌ల నుండి 35 ఫిర్యాదులు నమోదయ్యాయని, వాటిలో 29 కేసులు ఒక్క దుబాయ్‌లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రధాన నిందితుడు అందించిన దొంగిలించబడిన కార్డు డేటాను ఉపయోగించి, పలు మోసపూరిత సంస్థలకు చెందిన పీఓఎస్ (POS) మెషీన్ల ద్వారా లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

తదుపరి దర్యాప్తు పూర్తయ్యే వరకు అరెస్టు అయిన వారిని నిర్బంధంలోనే ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. అదే సమయంలో, అంతర్జాతీయ సహకార మార్గాల ద్వారా ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా పంపే అనుమానాస్పద లింక్‌లపై, ముఖ్యంగా చెల్లింపు లేదా బ్యాంకింగ్ వివరాలు కోరే వాటిపై క్లిక్ చేయవద్దని అధికారులు కోరారు. ట్రాఫిక్ జరిమానాలను అధికారిక ప్రభుత్వ వేదికల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com