ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల

- April 11, 2026 , by Maagulf
ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల

హైదరాబాద్: తన పై వస్తున్న ఆరోపణల పట్ల దర్శకుడు వేణు ఉడుగుల ఎట్టకేలకు స్పందిస్తూ, వాస్తవాలను వెల్లడించారు. గాయని మంగ్లీకి సంబంధించిన వివాదంలో తన పేరును అనవసరంగా లాగడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పరిచయస్తుల మధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోమని మాత్రమే సూచించానని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలో చట్టపరంగా తన ప్రమేయం లేదని వేణు ఉడుగుల వివరించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా తన పేరు లేదని, ప్రాథమిక విచారణలో పంజాగుట్ట పోలీసులు సైతం తనకు క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేశారు. అంతే కాకుండా, ఈ కేసులో ఫిర్యాదు దారుడైన అడ్వకేట్ సుబ్బారావు కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారంలో తన తప్పు ఏమీ లేదని స్పష్టతనిచ్చిన వీడియోలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఇలాంటి ఆధారాలు ఉన్నప్పటికీ తనను నిందితుడిగా చిత్రీకరించడం బాధాకరమని పేర్కొన్నారు. నైతిక విలువలతో కూడిన పాత్రికేయ విలువల గురించి వివరిస్తూ, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే కథనాలను ప్రసారం చేసే ముందు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల కలిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేనిదని, అభిమానుల ప్రేమే తనకు కొండంత అండ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా తప్పుడు వార్తలకు ముగింపు పలకాలని కోరుతూ, నిజనిజాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com