ఫిలిప్పీన్స్ వీధులు రక్తసిక్తం..
- August 04, 2016
ఫిలిప్పీన్స్ వీధులు రక్తసిక్తం అవుతున్నాయి. రోడ్లపై కాళ్లు, చేతులు కట్టేసి పడేసిన వాళ్లు, మొఖం నిండా టేపులు అతికించి ఉన్న వాళ్లు, చొక్కాలు రక్తసిక్తమైన వాళ్లు, అవయవాల నుంచి రక్తమోడుతున్న వాళ్లు, హత్యకు గురైన వాళ్లు వీధుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలు స్థానిక పత్రికలతోపాటు పలు అంతర్జాతీయ పత్రికల మొదటి పేజీలో ప్రముఖంగా కనిపిస్తున్నా ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్‌టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదు. రోడ్డుపై హత్యకు గురైన భర్తను అక్కున చేర్చుకొని ఏడుస్తున్నా ఓ యువతి హృదయవిదారక దృశ్యాన్ని చూసినా ఆయనకు ఏ మాత్రం సానుభూతి కలగలేదు.పైగా ఆ దృశ్యాన్ని ఆయన తన హెచ్చరికకను ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. 'నీవు చావదల్చుకోలేనప్పుడు, నీవు గాయపడదల్చుకోనప్పుడు, మత గురువులనుగానీ మానవ హక్కుల సంఘాలనుగానీ నమ్ముకోకు. వారెవరూ నీ ప్రాణాలను రక్షించలేరు' అంటూ హెచ్చరించారు. వీధుల్లో ఈ రక్తపాతానికి బాధ్యుడు ఆయనే. దేశంలో డ్రగ్ మాఫియాను అంతం చేసేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని దేశ పౌరులను ఆదేశించిందీ ఆయనే.దేశంలోని మానవ హక్కుల సంఘాలతోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశాధ్యక్షుడు డ్యూటర్‌టీ వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ డ్రగ్ అనుమానితుల హత్యలను బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నారు. 'మీ చర్యలను రెట్టింపు చేయండి, అవసరమైతే మూడింతలు చేయండి. ఆఖరి డ్రగ్ డీలరు లొంగిపోయేవరకు, జైల్లో పెట్టేవరకు లేదా భూస్థాపితం చేసే వరకు మనం విశ్రమించకూడదు' అంటూ పౌరులను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. డ్రగ్ మాఫియా గురించి వింటేనే తనకు చెప్పలేనంత కోపం వస్తోందని, తాను ఎప్పుడూ ఇంతేనని, మేయర్‌గా ఉన్నప్పుడు కూడా ఇంతో కోపంతో వ్యవహరించానని తాజాగా చెప్పారు.జూన్ 30వ తేదీన దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే ఆయన దేశంలోని డ్రగ్ మాఫియాను సమూలంగా నిర్మూలిస్తానని శపథం చేశారు. వీలైతే డ్రగ్ డీలర్లును పోలీసులకు పట్టిమ్మన్నారు. చేతిలో తుపాకి ఉంటే, అక్కడికక్కడే కాల్చేయమని ప్రజలకు పిలుపునిచ్చారు.హత్య చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చారు. కానీ ఈ పిలుపు కారణంగా డ్రగ్ మాఫియా పేరిట అమాయకుల హత్యలు కూడా జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు గొడవ చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ వరకు 465 మంది హత్యలకు గురయ్యారు. తన భర్త అమాయకుడని, ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడని, ఆయన్ని అన్యాయంగా హత్య చేశారంటూ జెన్నీలిన్ ఒలాయ్‌రెస్ హృదయవిదారకంగా విలిపించినా దృశ్యం కూడా ఆయన్ని కదలించలేక పోయింది. ఆయన కారణంగా ఇప్పుడు దేశంలో చట్టరహిత భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







