యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..

- April 13, 2026 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..

మనామా: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహ్రెయిన్‌లో కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫాను మనామాలో కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సోదర సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ తాజా పరిణామాల పై విస్తృతంగా చర్చించారు.

యూఏఈ–బహ్రెయిన్ మధ్య అభివృద్ధి ప్రాధాన్యతలు, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే రంగాల్లో సమన్వయాన్ని పెంచాలని నిర్ణయించారు.

కింగ్ హమద్, యూఏఈ అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరు దేశాల నాయకత్వాల మధ్య ఉన్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది. ముఖ్యంగా ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా పరస్పర సంప్రదింపులు, సమన్వయాన్ని మరింత కొనసాగించాలనే ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులు, వాటి ప్రభావం ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత, సముద్ర మార్గ భద్రత, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై పడుతున్న ప్రభావాలను కూడా సమావేశంలో సమీక్షించారు.

యూఏఈ, బహ్రెయిన్‌తో పాటు ప్రాంతంలోని ఇతర దేశాల్లో పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ దాడులను కూడా చర్చలో ప్రస్తావించారు. ఇవి సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు విరుద్ధమని, ప్రాంతీయ శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నాయని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాని ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సహా ఇరు దేశాల పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com