నువ్వు ఇంకేదైనా మరిచిపోయావా..!

- August 05, 2016 , by Maagulf
నువ్వు ఇంకేదైనా మరిచిపోయావా..!

ఎందుకొచ్చావో తెలియకనే వస్తావు

మన్నుకు మిన్నుకు చుట్టానివైతావు 

నిప్పుతో నీళ్ళతో అటాడుకుంటావు 
గాలిలో ధూళిలో తడిసి పోతుంటావు

అడుగులు మార్చుకున్న గాలిని 
మాటలు నేర్పుతున్న మట్టినీ
లెక్కకు రాని చుక్కలని 
లెక్కే లేని దూరాలనీ 
పారే చూపులతో తడిపేసి పోతావు

నువ్వు పిలవకున్నా 
నీతో నడిచిన నెలవంక 
నువ్వు అడగకున్నా 
నీకోసం కురిసిన మేఘం 
అప్పుడప్పుడూ ముఖం దాచుకుంటే దిగులు పడతావు

అబద్ధాన్ని బ్రతికించేందుకో 
నిజాన్ని దాచేందుకో 
కొన్ని ఉదయాలు ఉదయిస్తుంటాయనీ 
ఇంకొన్ని సాయంత్రాలు అస్తమిస్తుంటాయనీ
నిన్నా మొన్నటిదాకా నీదనుకున్న ప్రపంచం 
నీకెప్పుడూ చెప్పనప్పుడు 
గుండె పగిలిన పత్తి గింజవైతావు 
దూదిలా నవ్వుకుంటావు      
    
 పారువెల్ల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com