NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

- April 21, 2026 , by Maagulf
NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐ తెలుగు దేశం పార్టీ (TDP) సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మరియు ఒమాన్ దేశాలను కలిపిన గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రావి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, గౌతు శిరీష, ఏపీ ప్రభుత్వం సలహాదారు మరియు APNRTS అధ్యక్షుడు డా. రవి కుమార్ పి. వేమూరు, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ హాజరై ముఖ్యమంత్రి సేవలను ప్రశంసించారు.

సమావేశ ప్రారంభంలో నిర్వాహకులు సభ్యులకు స్వాగతం పలుకుతూ, చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. రక్తదాన శిబిరాలు, పేదలకు ఆహార పంపిణీ, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో సభ్యులు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని పేర్కొన్నారు.

యువత మరియు మహిళా విభాగాలు చురుకుగా పాల్గొని కార్యక్రమాలకు మరింత ఉత్సాహం నింపాయని, స్థానిక భారతీయ సంఘాలు, సామాజిక సంస్థల సహకారంతో వేడుకలు విస్తృత స్థాయిలో నిర్వహించబడినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా APNRTS డైరెక్టర్ (ఆపరేషన్స్ & సర్వీసెస్) నాగేంద్ర బాబు అక్కిలి ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలను వివరించారు. అత్యవసర సహాయం, రిపాట్రియేషన్, మెడికల్ సపోర్ట్, లీగల్ సహాయం, ఉద్యోగ మార్గదర్శకత్వం వంటి సేవలను ప్రతి ఎన్ఆర్ఐ వినియోగించుకోవాలని సూచించారు.

సమావేశంలో ముఖ్యమంత్రి విజనరీ నాయకత్వం, అభివృద్ధి దృష్టి, ప్రజా సేవా కార్యక్రమాలపై ప్రసంగాలు జరిగాయి. గల్ఫ్ దేశాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. ముఖ్య అతిథులు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రవాస భారతీయులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, యూఏఈ (దుబాయ్), కువైట్, బహ్రెయిన్ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

చివరిగా గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రావి, కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమావేశం ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com