మే 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!

- April 22, 2026 , by Maagulf
మే 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!

న్యూ ఢిల్లీ: దేశంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ మనీ మరియు ఆన్‌లైన్ గేమింగ్ వల్ల ప్రతి సంవత్సరం సుమారు 45 కోట్ల మంది ఆర్థికంగా నష్టపోతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వాటిని నియంత్రించేందుకు భారీ నిర్ణయం తీసుకుంది. ఏటా సుమారు రూ. 20,000 కోట్ల మేర సామాన్యుల సొమ్ము హారతి కర్పూరం అవుతుండటంతో, ప్రభుత్వం ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో పనిచేసేలా ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.MeitY అదనపు కార్యదర్శి ఈ అథారిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.హోం శాఖ, ఆర్థిక సేవలు, సమాచార ప్రసారాలు, క్రీడలు మరియు న్యాయ శాఖల జాయింట్ సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు.

2025 నాటి ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టంలో సవరణలు మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి.ఈ అథారిటీ ఐటీ శాఖ కింద ఒక డిజిటల్ ఆఫీస్‌గా పనిచేస్తూ, ఈ-స్పోర్ట్స్ సహా అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.డేటా రిటెన్షన్ మరియు ఇతర కఠిన మార్గదర్శకాలను జారీ చేసే పూర్తి అధికారం ఈ సంస్థకు ఉంటుంది.

కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. సోషల్ గేమింగ్ లేదా ఈ-స్పోర్ట్స్ సేవలను అందించాలనుకునే కంపెనీలు కచ్చితంగా ఈ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనివల్ల బాధ్యతాయుతమైన గేమింగ్ సంస్కృతి పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, యువత మరియు సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకే ఈ నిషేధం మరియు నియంత్రణ విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

కొన్ని రకాల గేమ్‌లకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరమని నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నాయి. పెద్ద సంఖ్యలో యూజర్లు పాల్గొనే గేమ్‌లు, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్నవి, అధిక ప్రమాదకరంగా పరిగణించే వాటికి ఇది వర్తిస్తుంది. ఆన్ లైన్ గేమింగ్ కార్యకలాపాలను నియంత్రించడం, నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడే సంస్థపై చర్యలు తీసుకోవడం వంటివి ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com