ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- April 27, 2026
యూఏఈ: రాబోయే ఈద్ అల్ అదా పండుగ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ఒక అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా మలేరియా ఎక్కువగా ప్రబలే ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు, శిశువులను మరియు చిన్న పిల్లలను దోమకాటు నుండి రక్షించుకోవాలని సూచించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రత్యేకంగా శిశువుల కోసం రూపొందించిన తొలి మలేరియా మెడిసిన్ కు ఆమోదం తెలిపింది. అత్యంత ప్రమాదానికి గురయ్యే ఈ వయస్సు పిల్లల్లో వ్యాధికి చికిత్స చేసే విధానంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా డాక్టర్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 25న పాటించిన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నవజాత శిశువులు మరియు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెడిసిన్ కు ఆమోదం తెలిపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ ప్రకటించారు.
దోమలు కుట్టకుండా..
ఈద్ సెలవుల సమయంలో చాలా కుటుంబాలు ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ సమయం చాలా కీలకమని యూఏఈ శిశువైద్యులు అన్నారు. ప్రాథమిక నివారణ చర్యగా, మలేరియా ప్రబలంగా ఉన్న దేశాలకు ముఖ్యంగా నవజాత శిశువులు మరియు పసిపిల్లల విషయంలో, ప్రయాణాలను నివారించాలి. అలాగే, దోమలు మరియు కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల వల మరియు కీటక నివారిణిలను వాడాలని బుర్జీల్ మెడికల్ సిటీకి చెందిన స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ డాక్టర్ హనీ అల్రెఫాయ్ అల్హెండవీ సూచించారు. ప్రయాణానికి చాలా ముందుగానే నివారణ చర్యలు ప్రారంభించాలని, అందులో భాగంగా మలేరియా నివారణ మందుల (యాంటీ-మలేరియా డ్రగ్స్) కోసం వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.
'గేమ్ ఛేంజర్' కొత్త మెడిసిన్
'ఆర్టెమెథర్-లుమెఫాంట్రిన్'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలపడం, 5 కేజీల కంటే తక్కువ బరువున్న శిశువుల చికిత్సలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పూడ్చగలదని వైద్యులు తెలిపారు. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ మోడరన్ హాస్పిటల్‌కు చెందిన స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ మరియు నియోనాటాలజిస్ట్ డాక్టర్ మమతా బోత్రా మాట్లాడుతూ.. శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి మలేరియా ఔషధానికి ఆమోదం లభించడం శిశు ఆరోగ్య సంరక్షణలో చాలా ముఖ్యమైన పరిణామం అని అన్నారు. పుట్టిన మొదటి వారాలు మరియు నెలల్లోని శిశువులు అత్యంత ప్రమాదానికి గురయ్యే వర్గంలో ఉంటారని, అయినప్పటికీ వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన చికిత్సా ఎంపికలు ఇప్పటివరకు పరిమితంగానే ఉన్నాయని తెలిపారు.
సాధారణ చిట్కాలు
శిశువులు మరియు పిల్లలలో మలేరియా నివారణకు వైద్య సలహా మేరకు వారి వయస్సుకు తగిన దోమల నివారణ మందులను ఉపయోగించడం, వారికి పొడవాటి, తేలికపాటి దుస్తులు వేయడం, ఎయిర్ కండిషన్డ్ లేదా దోమతెరలు బాగా ఉన్న వసతి గృహాలలో ఉండటం వంటివి అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్పారు. వారికి వాడే మంచాలు లేదా పడకలపై దోమ తెరలను వేయాలని, దోమలు అత్యంత చురుకుగా ఉండే సాయంత్రం సమయంలో, తెల్లవారుజామున బయట తిరగకుండా ఉండాలని సూచించారు.
ఇక శిశువులకు కలిగే ప్రమాదాలలో హైపోగ్లైసీమియా కూడా ఒకటని, ఇది ఇన్ఫెక్షన్ వల్ల గానీ, దాని చికిత్స వల్ల గానీ సంభవించవచ్చని డాక్టర్లు తెలిపారు. ముఖ్యంగా నవజాత శిశువులు, పసిపిల్లలలో హేమోలిటిక్ కామెర్లు, సరిగ్గా పాలు తాగకపోవడం, ఎదుగుదల లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చన్నారు. తీవ్రమైన సందర్భాలలో కాలేయం, మూత్రపిండాల వైఫల్యం సంభవించి ప్రాణాంతకం కావచ్చని, నవజాత శిశువులు, పసిపిల్లలలో మలేరియా వల్ల మరణాల రేటు 75 శాతానికి పైగా ఉందని డాక్టర్లు హెచ్చరించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







