పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ

- April 28, 2026 , by Maagulf
పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ

న్యూ ఢిల్లీ: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడుతోంది. ప్రధానంగా విమాన ఇంధన ధరలు అదుపులేకుండా పెరుగుతుండటంతో విమాన సర్వీసులు నడపడం ఆర్థికంగా భారంగా మారిందని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విమాన నిర్వహణ ఖర్చులో సుమారు 40 శాతం వాటా ఇంధనానిదే కావడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే విమాన సేవలను నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఈ సంక్షోభం పై చర్చించేందుకు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ప్రముఖ సంస్థలతో కూడిన ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్’ మంగళవారం పౌర విమానయాన శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఏటీఎఫ్‌పై ప్రస్తుతం ఉన్న 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే తొలగించాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగినప్పుడు, దేశీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉండేలా గతంలో మాదిరిగా ‘క్రాక్ బ్యాండ్’ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ అదనపు భారం వల్ల సంస్థల మనుగడ కష్టమవుతుందని వివరించారు.

అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన ధరలను నియంత్రించడం కష్టమైనప్పటికీ, పన్నుల రూపంలో ఉపశమనం కలిగించి విమానయాన రంగాన్ని కాపాడాలని సంస్థలు కోరుతున్నాయి. ఒకవేళ ఇంధన ధరలు ఇలాగే కొనసాగి, ప్రభుత్వం మద్దతు లభించకపోతే విమాన టికెట్ల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి పెరగడమే కాకుండా, విమాన రాకపోకలు కూడా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com