TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం

- May 01, 2026 , by Maagulf
TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం

డాలస్, టెక్సస్: తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యవంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. “సరిగ్గా తెలుగు పలుకు: అర్థం–అనర్థం– అపార్థం” అనే అంశంపై ఆదివారం జరిగిన 91వ అంతర్జాల దృశ్య సమావేశంతో 6  సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకున్న 6 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ ఆరు సంవత్సరాల క్రితం ప్రజాకవి వంగపండు ప్రసాదరావు తన కళాకారుల బృందంచే జానపద గాన, నృత్య కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభించి అప్పటినుండి ఇప్పటివరకు స్త్రీవాద సాహిత్యం, దళిత సాహిత్యం, ముస్లిం, మైనారిటీ సాహిత్య అంశాలతో సహా అనేక కార్యక్రమాలతో కొన్ని వందలమంది సాహితీ ప్రముఖులతో ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాల దృశ్య సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సాహిత్యవేదిక ఆధ్వర్యవంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యాన్ని వారి కుటుంబసభ్యుల సహకారంతో ముద్రించడం, అలాగే నిలువెత్తు సిరివెన్నెల కాంస్య విగ్రహాన్ని అనకాపల్లి నగరంలో
ఆవిష్కరించడం, జానపద కవిబ్రహ్మ కొసరాజు గారి సర్వ లభ్య సాహిత్యాన్ని మనసు ఫౌండేషన్ సహకారంతో ముద్రించి ఆవిష్కరించడం మా అదృష్టం అన్నారు. కేవలం ముద్రించడమే గాక ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్నివిశ్వవిద్యాలయాలకు, ప్రముఖమైన గ్రంధాలయాలకు కానుకగా అందజేశామన్నారు. ఈ సాహితీ ప్రయాణంలో సహకరించి ప్రోత్సహిస్తున్న తానా నాయకత్వానికి, వివిధ ప్రసారమాధ్యమాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నాటి అంశం చాలా ముఖ్యమైనది. మన నిత్య జీవితంలో అనాలోచితంగా దొర్లే తప్పులను సరిజేసుకోక పోతే అవే తప్పులతో మన తెలుగు భాష సంకరం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఉదాహరణకు: అక్షింతలు కాదు–“అక్షతలు”; అనుయాయుడు కాదు–“అనుయాయి”; ఆధునీకరణ కాదు–“ఆధునికీకరణ”; ఆశీస్సులు కాదు–“ఆశిస్సులు”; సభకు ఆహ్వానింపబడిన వారు అనే అర్ధంలో వాడవలసినది ఆహ్వానితులు కాదు–“ఆహుతులు” అనేది సరైన పదం; ఇష్టాగోస్టి కాదు–“ఇష్టగోస్టి”; ఉపాధ్యాయురాలు కాదు–“ఉపాధ్యాయ” లేదా “ఉపాధ్యాయి” అనేవి సరైన పదాలు. కోటానుకోట్లు కాదు–“కోట్యనుకోట్లు”; తక్షణం కాదు- “తత్క్షణం”; తేజోవంతుడు కాదు-“తేజస్వంతుడు”; దీర్ఘకాలిక కాదు-“దైర్ఘకాలిక”; దురదృష్టకరం కాదు-“దురదృష్టం”; నటప్రపూర్ణ కాదు-“నటనప్రపూర్ణ”; పునరావృతం కాదు-“పునరావృత్తం”; పృచ్చకుడు కాదు-“ప్రచ్చకుడు”; ప్రతిష్టాత్మకమైన-“ప్రతిష్టాకర మైన”;ప్రప్రథంకాదు-“సర్వప్రథం”; మధ్యంతర కాదు-మధ్యాంతర; వ్యవస్థాపక దినం కాదు-“వ్యవస్థాపన దినం”; సంస్కృతీ సంప్రదాయాలు, సంస్కృతీవైభవం కాదు-“సంస్కృతి సంప్రదాయాలు”, “సంస్కృతివైభవం” అనేవి సరైన పదాలు అన్నారు. ఈ అంశంపై కొన్ని రచనలు వచ్చినప్పటికీ ప్రముఖ రచయిత డా. రవ్వా శ్రీహరి వ్రాసిన “వాడుకతెలుగులో అపప్రయోగాలు” పుస్తకంలో చాలా విషయాలు వివరించారు అన్నారు.

తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ – ఆరు సంవత్సరాలగా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఎంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ల కృషి కొనియాడదగ్గది అన్నారు. ఈ సాహిత్య కార్యక్రమాలు కేవలం తానా సంస్థకు ఒక కలికితురాయిగానే గాకుండా, విశ్వవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానుల ప్రశంసలు
అందుకుంటున్నాయన్నారు. తెలుగు చాలా సుందరమైన భాష, శతాబ్దాలగా ఎంతోమంది పండితులు, కవులు,రచయితలు, రచయిత్రులు సృష్టించిన సాహిత్యం మన తెలుగు వైభవానికి కారణం. ఇంతటి విలువైన సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు భాషామాధుర్యాన్ని చిన్నపటినుండే 
అందజేయాలన్నారు. తెలుగు మాటలు వ్రాసేటప్పుడు జాగ్రత్త వహించక పోతే అపార్ధాలకు దారి తీస్తాయి. ఉదాహరణకు:వేడి తేనీరు–వేడితే నీరు; రాయడం అంటే తలకు నూనె రాసుకోవడం లాంటి సందర్భంలో వాడాలి. వ్రాయడం అంటే కవిత వ్రాశారు అన్న సందర్భంలో వాడాలి. కాని ఇప్పుడు అన్నీ కలగాపులగం అవుతున్నాయి. ఇప్పుడు భాష పట్ల జాగ్రత్త వహించకపోతే తప్పుల తడక భాష బావితరాలకు అందించినవారం అవుతాము అన్నారు.

పత్రికా రచయితగా నాల్గు దశాబ్దాలకు పైగా అనుభవం గడించిన ఈనాడు (ఆంధ్రప్రదేశ్) దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు ఈ సాహిత్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ.. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఇలాంటి అంశాలపై నిర్వహించాల్సిన సమావేశాలను తానా ప్రపంచసాహిత్యవేదిక గత 6 సంవత్సరాలగా క్రమం తప్పకుండా
నిర్వహించడం విశేషం. తానా ప్రపంచసాహిత్యవేదికకు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు, సాహిత్యవేదిక నిర్వాహకులు డా.తోటకూర ప్రసాద్ మరియు వారి బృందానికి అభినందనలు అన్నారు.
‘షష్ఠిపూర్తి’ అంటే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ‘షష్టిపూర్తి’ అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం. ఒక చిన్న అక్షరం అర్థంలో ఎంతో మార్పు తీసుకువస్తుంది, కనుక ఏ సందర్భంలో ఏమి వాడుతున్నామో జాగ్రత్త వహించాలి అన్నారు.

అలాగే – “అర్థం” అంటే ధనము లేదా భావము; “అర్ధము” అంటే సగభాగం. “అడుగు” అంటే సందర్భాన్నిబట్టి దాని భావం మారుతూ ఉంటుంది. అడుగు అంటే – ఏదైనా కావాలని అడగడం లేదా 12 అంగుళాల కొలమానం, లేదా అడుగు భాగం. ఇలా ఒక పదానికి ఎన్నో  నానార్థాలుంటాయి. మన బంధుత్వాలకు తెలుగుభాషలో 52 దాకా వివిధ రకాల పేర్లున్నాయి. ఇంత వైవిధ్యం మరే ఇతర భాషలలోను కానరాదు. ఇలాంటి సొగసైన భాషను కాపాడుకోవలసిన బాధ్యత మనఅందరిపైన ఉంది. బ్రిటష్ పాలనలో మన తెలుగు పేర్లు వారికి పలకడానికి కష్టంగా ఉండడంవల్ల కొన్నింటిని సంకరం చేశారు. ఉదాహరణకు: కర్నూలు – కుర్నూల్ (Kurnool) గా, కడప – కుడుప (Cuddapah) గా, పూళ్ళ – (Pulla) పుల్లగా, బ్రహ్మపుత్ర –Berhampur) బరంపురం గా, సామర్లకోట – (Samalkot) సామల్కొట్ గా, భువన గిరి –(Bhongir) భోన్గిర్ గా, నర్సాపురం – (Narsapur) నర్సపూర్ గా, అనంతపురం (Anantapur) అనంటపూర్ గా,
గుత్తి – (Gooty) గూటీ గా పదబ్రంశం అయ్యాయి. కాని ఆ పదాలను సరిచేసుకోకుండా మనం అలాగే కొనసాగించడం శోచనీయం. అయితే బ్రిటిష్ కాలంలో మన తెలుగు భాష, సాహిత్యాలకు సి. పి. బ్రౌన్,కల్నల్ మెకన్జీ ల లాంటి అధికారులు చేసిన మేలును కూడా మనం గుర్తించుకోవాలి. బ్రౌన్ కృషి వల్లే ప్రజాకవి వేమన సాహిత్యం, మనుచరిత్ర, వసుచరిత్ర వంటి ప్రాచీన కావ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిత్య జీవితంలో మనం ఎన్నో పదాలు తెలియకుండా తప్పుగా మాట్లాడుతూంటాము. ఉదాహరణకు: పాట్నా కాదు - పట్నా; షిమ్లా కాదు – సిమ్లా; అమీర్ ఖాన్ కాదు – ఆమిర్ ఖాన్, బాలాసోర్ కాదు – బాలేశ్వర్, మోడి కాదు - మోది. మన పదాలను మనం సరిచేసుకుని ముందుకు సాగడం ముఖ్యం,అలాగే మాండలికాలను కూడా ఆదరించాలి. ప్రాంతాలు మారే కొద్దీ వస్తువుల పేర్లు మారుతూ ఉంటాయి. గోంగూర –పుంటి కూర – గోగాకు; వేరు శనగకాయలు – శనక్కాయలు – శెనిగ్గాయిలు, బుడ్డలు – పల్లీలు. ఇదంతా మన తెలుగు
సంపద, వీటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ఉన్న పదాలు మరుగున పడిపోకుండా కాపాడుకోవడంలో, క్రొత్త పదాలను సృష్టించడంలో, తెలుగు నిఘంటువుల నిర్మాణంలో ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ రామోజీరావు కృషి అభినందనీయం. మన అమ్మ మనకు ఎంత ముఖ్యమో, మన తల్లిభాష కూడా మనకు అంతే ముఖ్యం అని అందరూ భావించిన నాడే మన భాష మనగల్గుతుంది అని ఎం. నాగేశ్వరరావు తెలియజేశారు.

పత్రికారచయితగా సుదీర్ఘమైన అనుభవం గడించిన, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షులు పూల విక్రం ఈ సభలో గౌరవ అతిథిగా పాల్గొని తన హోదాలో ప్రభుత్వ పరిపాలనలోను, నామ ఫలకాలపై, ఉత్పాదక వస్తువుల పై తెలుగు ఉండేటట్లు తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్ ల పై కూడా ఆంగ్లం బదులు ఎక్కువగా తెలుగు వాడేటట్లు సంభందిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అందరి సూచనలు, సలహాలతో పరిపాలనా భాషగా తెలుగు ఎక్కువగా వాడకంలో ఉండేటట్లుచేయడమే తన ధ్యేయం అన్నారు.

కొంతమంది రచయితలు వ్రాసేటప్పుడు కూడా చాలా పదాలు తప్పుగా వ్రాయడం చూస్తూ ఉంటాం. ఉదారణకు: హావభావాలు – హావబావాలు గా; అభివృద్ధి ని – అభివృద్ధి గా వ్రాయడం; ‘కళ’ వ్రాయవలసినచోట ‘కల’ అని వ్రాయడం; వాణి ని – వాని గా; కరచాలనం – ఖరచాలనం గా; విలేకరి ని – విలేఖరి గా ఇలా తరచుగా దొర్లే దోషాలను సరిచేసుకోవాలి అన్నారు. పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు భాషాభిమాని. తెలుగు వాడకానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారని, ఎన్నో ప్రభుత్వ పథకాలకు చక్కని తెలుగు పేర్లు ఏరి కోరి పెట్టేవారన్నారు.

అలాంటి రోజులు మరలా తిరిగి రావాలన్నారు. తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం తానా సంస్థ ఏళ్ళ తరబడి చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు, వక్త, సంగీతావధాని డా. మీగడ రామలింగస్వామి మాట్లాడుతూ తెలియక
తప్పుగా వ్రాయడం ఒక విషయం అయితే బాగా చదువుకున్నవాళ్ళు, రచయితలు కూడా తెలుగును అక్షర దోషాలతో వ్రాయడం విచారకరం అన్నారు. ఉదాహరణకు: ‘బాధ’ ను భాద గా; ‘బేదం’ ను  భేదం గా; ‘బాధ్యత’ ను భాధ్యత గా వ్రాస్తూంటారు. సరి చేసుకోవలసిన అవసరం ఉంది. నిరసన అని వ్రాయవలసిన చోట నిరశన అని; నిరశన అని వ్రాయవలసిన చోట నిరసన అని వాడుతూంటారు. రెండింటికీ తేడా ఉంది. ‘నిరసన’ అంటే అసమ్మతి. ‘నిరశన’ అంటే
నిరాహారదీక్ష అని గమనించాలి. సభలలో మాట్లాడేటప్పుడు ‘సభికులకు’ స్వాగతం అంటారు, సభికులు అనకూడదు. సభికులు అంటే జూదగాళ్ళు అని అర్థం. ‘సభాసదులు’ అనేది సరైన పదం. విదాత కాదు – విధాత; సబాధ్యక్షులు కాదు – సభాధ్యక్షులు; బారసాల కాదు – ‘బాలసారె’; స్వాంతనము కాదు ‘సాంత్వనము’; అంబోధి కాదు - ‘అంభోది; అశ్రుతాంజలి కాదు - ‘అశ్రునివాళి’. పజ్జ్యాలు కాదు – ‘పద్యాలు’; అలాగే ఒకే రకంగా ధ్వనించే పదాల పట్ల జాగ్రత్త
వహించాలి. ఉదాహరణకు: ‘దామము’ అంటే దారం; ‘ధామము’ అంటే కాంతి; ‘అనలం’ అంటే అగ్ని; ‘అనిలం’ అంటే గాలి; ‘కంది’ అంటే కంది పంట; ‘కంధి’ అంటే సముద్రం; ‘స్వజనం’ అంటే తోటి ప్రజలు; ‘శ్వజనం’ అంటే కుక్కల గుంపు. పేర్ల విషయానికొస్తే – ‘మల్లికార్జున రావు’ అని వ్రాయాలి – మల్లిఖార్జునరావు కాదు; మల్లేశ్వరరావు కాదు – ‘మల్లీశ్వరరావు’; కోటేశ్వరరావు కాదు – ‘కోటీశ్వరరావు’; శివన్నారాయణ కాదు – ‘శివనారాయణ’; సత్యన్నారాయణ
కాదు – ‘సత్యనారాయణ’ అని వ్రాయాలి అన్నారు డా. మీగడ.ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, తెలుగు సాహిత్యాభిమాని డా.కర్రి రామారెడ్డి తన దృష్టిలో ఉన్న కొన్ని తెలుగు

పదాలను ఉటంకించారు. శాఖాహారం కాదు – ‘శాకాహారం’; ఆష కాదు – ‘ఆశ’, తుఫాను కాదు – ‘తుపాను’. “సన్నాసి” అంటే – ఎందుకూ పనికిరాని వాడు, “సన్యాసి” అంటే సన్యాసాశ్రమం లో ఉన్నవాడు. కొన్ని పదాలు మనం సరిగ్గా వాడితే వింతగా ఉంటాయి. ఉదాహరణకు: వేలు కు సరైన రూపం – ‘వ్రేలు’; గుడ్డు కు సరైన రూపం ‘గ్రుడ్డు’; మోకరిల్లు కు సరైన రూపం – ‘మ్రోకరిల్లు’. కాని మనం తరచూ వ్యావహారిక పదాలనే వాడుతూంటాము. ప్రాంతాలను బట్టి కొన్ని పదాలకు అర్ధాలు మారుతూ కొన్ని ప్రాంతాలలో అవి తప్పు పదాలవుతాయి. ఉదాహరణకు: ‘దొబ్బేయడం’ – అంటే దొంగతనం చేయడం; ‘ముండలు’ అంటే శిరోముండనం చేయించుకున్నవారు; ‘దిగులవుతుంది’ అంటే ఒకచోట ‘బాధ’ గా ఉన్నదనే అర్ధంలో, మరోచోట ‘భయం’ అనే అర్ధంలో వాడతారు. సామాన్య ప్రజల మాటలనుండి కూడా మనం క్రొత్త పదాలను నేర్చుకోవచ్చు అన్నారు. ఉదాహరణకు: నా దగ్గరకు వచ్చే రోగులు నా  మెడలో ఉండే సెతస్క్పోప్ కు “గుండె మాను” అని పేరుపెట్టారు. డా.కర్రి మాట్లాడుతూ వైద్యకళాశాల విద్యకు వరకు తన విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలో నే జరిగిందని, విశిష్టమైన తెలుగు భాష అంటే తనకు ఎంతో మక్కువ అని తమిళనాడు లో ‘కాంతి’ అని వ్రాయవలసినా, ‘గాంధి’ అని వ్రాయవలసినా ‘కాంతి’ అనే వ్రాస్తారు. వారికి గ అనే అక్షరం ఉండదు అన్నారు. తెలుగు సుందరమైన భాష అన్నారు డా. కర్రి రామారెడ్డి.

విశిష్టఅతిథిగా పాల్గొన్న ప్రముఖ శతావధాని డా.బులుసు అపర్ణ మాట్లాడుతూ – తానా ప్రపంచసాహిత్యవేదిక ద్వారా ప్రతి నెల విభిన్న సాహిత్య కార్యక్రమాలతో గత 6 సంవత్సరాలగా అంతర్జాల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర, అభినందనీయం అంటూ ఈ నాటి అంశం చాలా అవసరం అయినది అన్నారు. తల్లిదండ్రులు భక్తిపూర్వకంగా తమ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించకుండా పెట్టేస్తున్నారు. ఉదాహరణకు: “వేంకటాచలపతి” పేరు చలపతిగా పెట్టడంవల్ల దాని అర్థమే మారిపోతుంది. అచలపతి అంటే కదలకుండా స్థిరంగా ఉండేది, కాని చలపతి అనే పెట్టడం వల్ల స్థిరంగా లేకుండా ఎప్పుడూ కదిలేది అని అర్ధం వస్తుంది. అలాగే – సాంబశివ మూర్తి, సత్యనారాయణ మూర్తి, నరసింహ మూర్తి లాంటి పేర్లు పూర్తి రూపంలో వాడుకలో లేక అందరూ మూర్తులు గానే మిగిలిపోతున్నారు. కేవలం మూర్తి అని
పిలవ బడడంవల్ల వారు నిజానికి ఏ దైవ మూర్తో తెలియకుండా అందరూ విగ్రహాలు గానే మిగిలిపోతున్నారు. అలాగే -సాంప్రదాయం కాదు – ‘సంప్రదాయం’; సంప్రదాయం తర్వాత ఏదైనా పదం కలిపితే అప్పుడు సాంప్రదాయ అని వాడవచ్చును. ఉదాహరణకు: సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణ; హార్థిక కాదు – ‘హార్దిక’; ఆర్దిక కాదు – ‘ఆర్ధిక’;
భాష్పవాయువు కాదు – ‘బాష్పవాయువు’; భాష్పాంజలి కాదు – ‘బాష్పాంజలి’; అలాగే కొన్ని పదాలు అనాలోచితంగా వాడేస్తుంటాం. ఉదాహరణకు: శుద్ధతప్పు అనకూడదు. శుద్ధ తప్పు అనేది వైరి సమాసం. ‘శుద్ధ దోషం’ లేదా ‘బొత్తిగా తప్పు’ అనవచ్చును. ‘పండిత మాన్యులు’ అంటే పండితులచే గౌరవింపబడేవారు – ‘పండితం మన్యులు’ – తమకు తామే
పండితులము అని భావించుకునే వారు; ‘విద్యార్ది’ అని వాడకూడదు – విద్యార్ది అంటే అరజ్ఞానం అభ్యసించే వాడు. ‘విద్యార్ధి’ అంటే విద్యను అభ్యసించే వాడు. ‘సమయాభావం లేకపోవడం’ వల్ల సభను ముగిస్తున్నాం అంటారు.

సమయాభావం అంటే సమయం లేకపోవడంవల్ల గనుక సమయాభావం వల్ల అని అనాలి. ‘కడుపు మంట’ అసూయ అనే అర్ధంలో వాడాలి. ‘కడుపులో మంట’ అనారోగ్యం అనే సందర్భంలో వాడాలి. వయోపరిమితి కాదు – “వ యఃపరిమితి”; ‘మదురాదిపతి’, ‘మదుర మీనాక్షి’ కాదు – ‘మధురాధిపతి’, ‘మధుర మీనాక్షి’ అనేవి సరైన పదాలు; పండగ కాదు –
‘పండుగ’; మనవడు కాదు – ‘మనుమడు’; స్త్రీ పండితులనుద్దేశించి “పుంభావ సరస్వతి” అని అనకూడదు. పుంభావ సరస్వతి అంటే పురుష రూపంలో ఉన్న సరస్వతి అని అర్ధం. ‘ఫుల్లకుసుమిత’ అనాలి పుల్లకుసుమిత కాదు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ సాహిత్యవేదిక ఆవిర్భావం నుండి అన్ని కార్యక్రమాలలో భాగం కావడం చాలా సంతోషం అని, ఇప్పటివరకు 90కి పైగా సాగిన సాహిత్య కార్యక్రమాలు సాహిత్య పరిశోధక విద్యార్ధులకు ఉపకరించే అంశాలుగా మారడ ముదావహం అన్నారు. ఈ నాటి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ చేస్తున్న కృషి ఎంతో అభినందిచదగ్గ విషయం, కార్యక్రమ నిర్వహణలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, ప్రసార మాధ్యమాలకు, అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com