యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!

- May 03, 2026 , by Maagulf
యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!

యూఏఈః యూఏఈలో జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) గగనతలంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో విమాన టిక్కెట్ల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఈ చర్య వల్ల మరిన్ని విమానాలు అందుబాటులోకి వస్తాయని, విమానయాన సంస్థల ఖర్చులు తగ్గుతాయని, తద్వారా ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుందని వారు తెలిపారు.

ఫిబ్రవరి 28న యూఏఈ తన గగనతలంపై ఆంక్షలు విధించినప్పటి నుండి విమానయాన సంస్థలు చాలా అధిక బీమా రేట్లను చెల్లించాల్సి వచ్చిందని డీరా ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సుధీష్ టిపి తెలిపారు. ఇప్పుడు GCAA ఆంక్షలను తొలగించడంతో భీమా ఛార్జీలు కూడా తగ్గుతాయన్నారు. సుమారు రెండు నెలల తర్వాత దేశ గగనతలంలో విమాన రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయని  GCAA ప్రకటించింది.  

మరిన్ని విమానాలు, తక్కువ ధరలు
జీసీఏఏ నిర్ణయంతో ప్రతి విమానాశ్రయానికి విమానాల సంఖ్య పెరుగుతుందని అల్హింద్ బిజినెస్ సెంటర్ ఎండీ నౌషాద్ హసన్ తెలిపారు.  ఆంక్షలను తొలగించడంతో విమానయాన సంస్థలు ఇప్పుడు అన్ని గమ్యస్థానాలకు పలు విమానాలను నడపగలవని, దీనివల్ల సీట్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందన్నారు. దక్షిణ భారతదేశంలోని కోజికోడ్‌కు విమానాలను ఆయన ఉదాహరణగా తెలిపారు. ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ఈ గమ్యస్థానానికి మొత్తం 200 సీట్లు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 2,000 సీట్లకు పైగా పెరిగిందన్నారు. దీనివల్ల ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

ముసాఫిర్.కామ్ సీఓఓ రహీష్ బాబు తాజా నిర్ణయాన్ని ప్రయాణికులకు "శుభవార్త" అని అభివర్ణించారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రతి విమానయాన సంస్థ విమానాలను నడపడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవలసి వచ్చేదన్నారు. ఇప్పుడు, ఆ ఆంక్షలన్నీ తొలగిపోవడంతో విమానయాన సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేయగలవని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com