'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- May 03, 2026
హైదరాబాద్: వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, అది మానవాళికి సేవ చేయడానికి తీసుకునే పవిత్ర ప్రతిజ్ఞ అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. వైద్యులు జ్ఞానం, సాంకేతిక నైపుణ్యంతో పాటు కరుణ, సానుభూతి వంటి మానవీయ విలువలను అలవరచుకోవాలని సూచించారు. "సేవే పరమ ధర్మం" స్పూర్తితో దేశ ప్రజలకు వైద్యులు సేవలందించాలనీ గవర్నర్ సూచించారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాల 175వ స్నాతకోత్సవానికి శనివారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఉస్మానియా వైద్య కళాశాల అనేక సంవత్సరాలుగా దేశానికి నిబద్ధతతో, నైపుణ్యంతో కూడిన వైద్యులను అందిస్తున్న గొప్ప వారసత్వ సంస్థగా నిలిచిందని గవర్నర్ కొనియాడారు. పట్టభద్రులైన విద్యార్థులు సాధించిన ఈ విజయానికి వారి కఠోర శ్రమ, అంకితభావమే కారణమని అభినందించారు.
ప్రస్తుత ఆరోగ్య రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో సాంకేతికత, పరిశోధనల ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్న గవర్నర్, ఆధునిక పరికరాలను వినియోగిస్తూనే మానవీయతను మరువకూడదని హితవు పలికారు.రోగికి వైద్యుడి పై ఉన్న నమ్మకమే అతిపెద్ద ఆస్తి అని చెప్పారు.
పట్టభద్రుల కుటుంబ సభ్యులు, అధ్యాపకుల పాత్రను గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి త్యాగం, మార్గదర్శకత్వం వల్లే ఈ విద్యార్థులు సమర్థులైన వైద్యులుగా ఎదిగారని పేర్కొన్నారు.
యువ వైద్యులు గ్రామీణ సేవ నుంచి అత్యాధునిక పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ నైతిక విలువలతో సేవ చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.ఉస్మానియా మెడికల్ కాలేజ్ గొప్ప సంప్రదాయాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుతూ పట్టభద్రులందరికీ ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.
అంతకుముందు గవర్నర్ వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు బహుకరించి అభినందించారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్,హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కే.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కాలేజీ (DME) నరేందర్ కుమార్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజా రావు తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









