సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- May 03, 2026
కరీంనగర్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఈ రోజు కరీంనగర్ ఫిలిమ్ సొసైటీ సమావేశ మందిరంలో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం-శాతవాహన లయన్స్ క్లబ్-లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన కవన గోదారి కవితా సంపుటి ఆవిష్కరణ సమావేశంలో ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలనం చేసిన డాక్టర్ నందిని సిధా రెడ్డి గ్రంధాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. యుద్ధాలు నుంచి దేశంలో జరుగుతున్న అంతర్గత సంక్షోభాల వరకు పలు అంశాలను ఇతివృత్తంగా చేసుకొని చక్కటి కవిత్వం రాసి మధుసూదన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. కవిత్వానికి వర్ణ వర్గాలు ఉండవని, కవితలు సమాజ హితం కోరుతాయని, కవుల స్వభావం సున్నితంగా, దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తమ కలానికి పదును పెడతారని అన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారని తెలిపారు. తన కవిత్వంతో పలు రకాలుగా సామాన్యులను సహితం చైతన్య పరుస్తూ తమదైన శైలిని చాటుకున్నారని కొనియాడారు. గ్రంధ సమీక్ష చేసిన సాహితీవేత్త అన్నాడి గజేందర్ రెడ్డి మాట్లాడుతూ కవన గోదారి కవితా సంపుటిలో 123 కవితలు పొందుపరిచారని అన్నారు. మందుబాబులు, సైబరాసురులు, మాదకాసురులు, అవినీతి రాజకీయాలు, పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రబుద్ధులను వదలకుండా తమదైన ఘాటు కవితలతో చురకలు అంటించారని తెలిపారు. ఆత్మీయ అతిథులు డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్‌లు మధుసూదన్ రెడ్డి కవిత్వంలోని చమక్కులను వివరించారు. తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి కిషన్, సహ కార్యదర్శి అనితలు పాల్గొని పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కవులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, యువతీయువకులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధా రెడ్డిని ఘనంగా సత్కరించారు. అదే విధం కవితా సంపుటి తొలి ప్రతిని బుర్ర జానకి రెడ్డి స్వీకరించారు. వివిధ సాహిత్య, సాహిత్యేతర సంస్థల బాధ్యతలు సిధా రెడ్డిని సత్కరించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







