జైలు అంటే శిక్ష మాత్రమే కాదు..సంస్కరణకు కేంద్రంగా మారాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- May 12, 2026
హైదరాబాద్: సమాజ అభ్యున్నతికి శిక్షతో పాటు సంస్కరణ కూడా సమానంగా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో రాష్ట్ర కారాగార శిక్షణ సంస్థ లో ఫీల్ ది జైల్ ( జైలు అనుభవం)’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫీల్ ది జైల్ సెల్ లను పరిశీలించారు.
అనంతరం జైలు మ్యూజియంను ప్రారంభించి నిజాం పాలన కాలంలోని జైలు లు , నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో ఖైదీల పాత్ర, దాశరథి, రామదాసు లను బంధించిన జైలు నమూనాలు, ఖైదీల్లో మార్పు కోసం తీసుకున్న చర్యలు, జైలు ఉత్పత్తులు, జైలు కార్యకలాపాలు, అచీవ్ మెంట్ లను గవర్నర్ పరిశీలించారు.అనంతరం గవర్నర్ విక్రయానికి ఉంచిన జైలు ఉత్పత్తులను పరిశీలించారు.అనంతరం వాల్మీకి పేరుతో ఖైదీల్లో సత్ప్రవర్తనకు తీసుకుంటున్న చర్యల వివరించే డాక్యుమెంటరీ నీ గవర్నర్ తిలకించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘జైలు మ్యూజియం’ ప్రారంభం కేవలం ఒక భవనం ప్రారంభోత్సవం కాదని, న్యాయం–సంస్కరణల దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఒక కీలక అడుగని అన్నారు. ఈ మ్యూజియంలో ప్రదర్శించిన పాత సంకెళ్లు, జైలు గదులు గతంలోని కఠిన కారాగార వ్యవస్థను గుర్తుచేస్తే, ఖైదీల నైపుణ్యాభివృద్ధి, కారాగార పరిశ్రమల ద్వారా రూపొందిన ఉత్పత్తులు వంటి కార్యక్రమాలు ‘ప్రతీకారం నుంచి పరివర్తన’ వైపు తీసుకెళ్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచాయని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రగతిశీల సమాజం అంటే తప్పు చేసిన వారిలో మార్పు తీసుకురావడానికి ఎంత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని గవర్నర్ అన్నారు. ఖైదీల పునరావాసం సమాజం యొక్క నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. తాను గతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రిజన్ మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు.
తెలంగాణ కారాగార శాఖ శిక్షతో పాటు పునర్నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు.‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాన్ని వినూత్న విద్యా కార్యక్రమంగా అభివర్ణించిన గవర్నర్, ముఖ్యంగా యువతలో చట్టాల పట్ల గౌరవం, క్రమశిక్షణ, పౌర బాధ్యతను పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. స్వేచ్ఛ ఎంత అమూల్యమైనదో, చట్టాన్ని పాటించడం సమాజానికి ఎలా మేలు చేస్తుందో ఈ కార్యక్రమం ప్రజలకు గుర్తుచేస్తుందన్నారు.
ఈ వినూత్న ఆలోచనను కార్యరూపం దాల్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, అధికారులను గవర్నర్ ఈ వేదికగా అభినందించారు. ఈ జైల్ మ్యూజియం భవిష్యత్తులో పర్యాటక ఆకర్షణగా మాత్రమే కాకుండా విద్య, పరిశోధన, సామాజిక చైతన్యానికి ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ...రాష్ట్ర ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్ శాఖలో ఈ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం కొత్త అధ్యాయం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







