కువైట్‌లో ఘనంగా NRI TDP మహానాడు వేడుకలు

- May 17, 2026 , by Maagulf
కువైట్‌లో ఘనంగా NRI TDP మహానాడు వేడుకలు

కువైట్ సిటీ: కువైట్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల ఐక్యత, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ NRITDP కువైట్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతి గర్వకారణం నందమూరి తారక రామారావు ఆశయాలను స్మరించుకుంటూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి సంఘీభావంగా ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.

కువైట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై మహానాడును విజయవంతం చేశారు. కార్యక్రమం ప్రారంభంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ చరిత్ర, ఎన్టీఆర్ ఆశయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో ఒక్కటిగా చేరడం ఆనందంగా ఉందన్నారు. కువైట్‌లోని NRITDP కార్యకర్తలు చూపిస్తున్న ఐక్యత పార్టీపై వారి ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, అదే స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ప్రముఖ నాయకులు అనిమిని రవి నాయుడు, సుగవాసి ప్రసాద్ బాబు, రమేష్ నాయుడు, వెంకట్ కోడూరి తదితరులు పాల్గొన్నారు. NRITDP కువైట్ నాయకులు ఉదయ్ ప్రకాశ్, ఓలేటి దివాకర్, రాచూరి మోహన్, ముస్తాక్ ఖాన్, ఓలేటి రెడ్డయ్య చౌదరి, డాక్టర్ కృష్ణ చైతన్య, నారాయణమ్మ, మురళి దుగ్గినేని, కొల్లపమని రమేష్ తదితరులు కార్యక్రమం విజయవంతానికి కీలకంగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా వెంకట్ కోడూరి మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ సంస్థ కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక” అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వేసిన బాటలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ పట్ల అభిమానం తగ్గదని, ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడన్నారు.

రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు భావోద్వేగ ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. “తెలుగుదేశం పార్టీ మా కుటుంబ రక్తంలో ఉన్నది. నా తండ్రి స్వర్గీయ పాలకొండ్రాయుడు పార్టీ కోసం చివరి శ్వాస వరకు కష్టపడ్డారు. అదే వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను” అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గౌరవానికి నిలువెత్తు ప్రతీక అని అన్నారు.

సుండుపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కోట్లాది తెలుగు ప్రజల ఆశయాల ప్రతీక అని పేర్కొన్నారు.

కువైట్‌లోని NRITDP నాయకులు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కువైట్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని షాప్ చైర్మన్ రవి నాయుడును కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం రేణిగుంటకు కువైట్ నుంచి త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించడంతో సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మహానాడు సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, విదేశాల్లోని తెలుగు ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిపి పలు తీర్మానాలు ఆమోదించారు.

కార్యక్రమం విజయవంతం కావడంలో ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు చుండు రెడ్డయ్య, తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ, దేవి చౌదరి, అంజలి, బీసీ విభాగం శంకర్ యాదవ్, మైనార్టీ విభాగం రహ్మతుల్లా, జనసేన పార్టీ కువైట్ అధ్యక్షుడు హరి రాయల్ తదితరులు సహకరించారు.

కార్యక్రమానికి హాజరైన తెలుగు ప్రజలకు ఆహార వసతులు కల్పించిన స్కై స్పైసీ రెస్టారెంట్ నిర్వాహకులను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. వరుసగా నాలుగు మహానాడు కార్యక్రమాలకు భోజన సదుపాయాలు కల్పించడం వారి సమాజ సేవా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి సన్మానం చేసి మెమెంటోలు అందజేశారు.

కువైట్‌లో నిర్వహించిన ఈ మహానాడు కార్యక్రమం విదేశాల్లోని తెలుగు ప్రజల ఐక్యతను, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పిందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com