సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి

- May 20, 2026 , by Maagulf
సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి

సౌదీ అరేబియాలో రెండుదశాబ్దాల పాటు కుటుంబం కోసం కష్టపడి పనిచేసిన తెలుగు మహిళ వీర వెంకమ్మ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మానవతా సహాయం అందింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన వీర వెంకమ్మ (67), తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడి జీవనం సాగించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆమె సుమారు 20 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్ సమీప అల్ ఖర్జ్ ప్రాంతానికి వెళ్లి ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ జీవనం కొనసాగించారు.

తన ఇద్దరు కుమార్తెల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం గత 12 సంవత్సరాలుగా స్వదేశానికి రాకుండా నిరంతరం శ్రమించారు. ఈ కాలంలో ఆమె కుమార్తెలు భారతదేశంలో తమ అమ్మమ్మ వద్ద నివసించేవారు.

అయితే ఇటీవల ఆమె తల్లి మరణ వార్త వీర వెంకమ్మను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇదే సమయంలో పెద్ద కుమార్తె వివాహ జీవితం కూడా సమస్యల్లో పడటంతో ఆమె ఉపాధి కోసం కువైట్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీర వెంకమ్మ చివరకు స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆమె వద్ద పాస్‌పోర్ట్ సహా అవసరమైన పత్రాలు లేకపోవడంతో స్వదేశ ప్రయాణం కష్టసాధ్యమైంది. ఈ విషయాన్ని అల్ ఖర్జ్ లేబర్ కోర్టు, GIO అల్ ఖర్జ్ అధ్యక్షుడు నాసర్ పొన్నానికి తెలియజేయగా, ఆయన వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. భారత రాయబార కార్యాలయం సహకారంతో వీర వెంకమ్మకు అవసరమైన పత్రాల ప్రక్రియ పూర్తి చేసి స్వదేశ ప్రయాణ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో భారత రాయబార కార్యాలయ అధికారి షకీబ్ కీలక సహకారం అందించారు.

తెలుగు మరియు కొంత అరబిక్ మాత్రమే తెలిసిన వీర వెంకమ్మకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని నాసర్ పొన్నాని సమన్వయం చేసి విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక సౌదీలో తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న SATA సంస్థ కూడా ముందుకు వచ్చి ఆమెకు విమాన టికెట్‌ను సమకూర్చింది. ఈ సందర్భంగా SATA వ్యవస్థాపకుడు మల్లేశన్, రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ, సర్వాణి విద్యాధరణి, గ్లోబల్ తెలుగు ప్రతినిధులు, సాటా ఈస్ట్రన్ టీం సభ్యులు, అల్ ఖర్జ్ బృందం మరియు ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు భారత రాయబార కార్యాలయ అధికారుల సేవలను అభినందించారు.

వీర వెంకమ్మకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ సౌదీలోని తెలుగు సమాజం కృతజ్ఞతలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com