బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- May 22, 2026
మహారాష్ట్రలో మానవ-మృగ సంఘర్షణ (Human-Animal Conflict) మరోసారి ఘోర విషాదానికి దారితీసింది. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గ్రామీణ మహిళలను మృత్యురూపంలో వచ్చిన పెద్దపులి బలితీసుకుంది. అడవిలోకి బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై పులి ఒక్కసారిగా దాడి చేయడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన చంద్రపుర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. చంద్రపుర్ జిల్లాలోని గంజేవాహి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం జరిగింది. స్థానిక గ్రామీణ సంప్రదాయం ప్రకారం, వేసవి కాలంలో ఎండిపోయిన బీడీ ఆకులను సేకరించడం అక్కడి ప్రజలకు సర్వసాధారణం. ఇందులో భాగంగానే గంజేవాహి గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు శుక్రవారం ఉదయం అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో ఆకులు ఏరుకుంటుండగా, పొదల్లో నక్కిన పెద్దపులి వారిపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. పులి దాడి చేయడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన మహిళలు ప్రాణభయంతో కేకలు వేస్తూ అడవి నుంచి గ్రామం వైపు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. భయాందోళనలకు గురైన ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారంతా ఒకే గ్రామానికి చెందిన శ్రామిక మహిళలుగా అధికారులు గుర్తించారు . కవుదుబాయి దాదాజీ మొహర్లే (45), అనుబాయి దాదాజీ మొహర్లే (40), సునీతా కౌశిక్ మొహర్లే (38), సంగీతా సంతోష్ (50). చంద్రపూర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.ఎం. రామానుజన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. పులి ఒకేచోట అందరిపై దాడి చేసిందా లేక వేర్వేరు ప్రదేశాలలో వేటాడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి పంచనామా నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. ఈ ఘోర ఘటనతో గంజేవాహి మరియు చుట్టుపక్కల అటవీ ప్రాంత గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రపూర్ జిల్లా చుట్టుపక్కల పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది, అయితే ఈ స్థాయిలో మనుషులపై దాడులు జరగడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సదరు నరభక్షక పులిని వెంటనే గుర్తించి, బంధించాలని గ్రామస్థులు అటవీశాఖను డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







