వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- May 24, 2026
అమెరికా: అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. వైట్‌హౌస్ భద్రతా చెక్‌పాయింట్ వద్దకు వచ్చిన ఓ దుండగుడు అకస్మాత్తుగా శనివారం సాయంత్రం(అక్కడి కాలమానం ప్రకారం) సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రతిగా అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారికంగా వెల్లడించింది.
సీక్రెట్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓ వ్యక్తి వైట్‌హౌస్ సమీపంలోని చెక్‌పాయింట్ వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌లో నుంచి ఆయుధాన్ని తీసి అక్కడ విధుల్లో ఉన్న అధికారులపై కాల్పులు ప్రారంభించాడు. దీంతో సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు కుప్పకూలిపోయాడు. ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధ్యక్షుడి భద్రతకు భంగం కలగలేదు!
అయితే ఆయనకు ఎలాంటి ముప్పు తలెత్తలేదని, అధ్యక్షుడి భద్రతకు భంగం కలగలేదని సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. ఘటన అనంతరం వైట్‌హౌస్ సముదాయాన్ని కొంతసేపు పూర్తిగా లాక్డౌన్ చేశారు. నార్త్ లాన్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. కాల్పుల శబ్దాలు వరుసగా వినిపించడంతో వైట్‌హౌస్ వద్ద విధుల్లో ఉన్న జర్నలిస్టులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు 15 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు జర్నలిస్టులను బయటకు వెళ్లకుండా అడ్డుకొని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి వెళ్లాలని సూచించారు.
ఘటన చోటుచేసుకున్న ప్రాంతం వైట్‌హౌస్‌కు సమీపంలోని 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ జంక్షన్‌గా గుర్తించారు. కాల్పుల తర్వాత అక్కడ భారీగా పోలీసు బలగాలు, ఫెడరల్ ఏజెన్సీల సిబ్బంది మోహరించారు. ఘటనాస్థలిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రహదారులపై క్రైమ్‌సీన్ టేపులు ఏర్పాటు చేసి ఆధారాలను సేకరించారు. కాల్పుల ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడినట్లు సమాచారం. అయితే అతడు దుండగుడి కాల్పుల్లో గాయపడ్డాడా? లేక భద్రతా సిబ్బంది ఎదురుకాల్పుల్లో గాయపడ్డాడా అన్న విషయంపై స్పష్టత రాలేదని అమెరికా చట్ట సంస్థలకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం
ఘటనపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కూడా స్పందించారు. వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై సీక్రెట్ సర్వీస్‌కు సహకరిస్తున్నామని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. "వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై ఎఫ్‌బీఐ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో భాగస్వామ్యం అవుతున్నాం. పరిస్థితిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఘటన తర్వాత వైట్‌హౌస్ భవనం పైభాగంలో కౌంటర్ స్నైపర్లను కూడా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







