కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్​ హత్య..ఏడుగురు అరెస్ట్

- May 30, 2026 , by Maagulf
కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్​ హత్య..ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం ఒక భూ వివాదం కారణంగా సినిమా స్క్రీన్‌ప్లేను తలపించేలా కొన్ని నెలల పాటు పక్కా ప్రణాళిక రచించి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం ఏడుగురు సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన సంచలన వివరాలను హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్​ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన మహబూబ్ అలంఖాన్, ముజాహిద్ అలంఖాన్ తండ్రీకుమారులు. వీరికి మలక్​పేట, లక్డీకపూల్​ పరిధిలోని విలువైన వక్ఫ్ భూముల విషయంలో వక్ఫ్ ప్యానల్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌తో దశాబ్దాలుగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాలతో ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న పగ, గతంలో పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నా చల్లారలేదు. ఇరువైపులా పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిరంతరం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగలేక, ఎలాగైనా లాయర్‌ అడ్డు తొలగించుకోవాలని తండ్రీ కుమారులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తమ అనుచరులుగా మెలిగే హసన్ అలీ, మునీర్​లకు బాధ్యత అప్పగించి, రూ.15 లక్షల సుపారీ మాట్లాడారు.

‘బాబా’ ఆదేశం..కారుతో ఢీకొట్టి హత్య

సుపారీ తీసుకున్న హసన్​, మునీర్​లు కిషన్ అనే వ్యక్తిని రంగంలోకి దింపారు. అయితే, ఎక్కడా అనుమానం రాకుండా కేవలం కారుతో మాత్రమే ఢీకొట్టి ప్రమాదంలా చిత్రీకరించి చంపాలన్న ముజాహిద్ అలియాస్​ బాబా ఆదేశాల మేరకు.. కిషన్​ డ్రైవింగ్​లో ఆరితేరిన అభిజిత్​ అలియాస్ ‘రైడర్ నాని’ని ఎంచుకున్నాడు. అభిజిత్​ మరో ఇద్దరితో కలిసి ఈ నెల 20, 21, 22వ తేదీల్లో న్యాయవాది ఇంటి సమీపంలో క్షుణ్ణంగా రెక్కీ నిర్వహించాడు. మొయిజుద్దీన్​ రోజూ ఉదయాన్నే ఈత (స్విమ్మింగ్) కోసం బయటకు వస్తాడని నిందితులు గుర్తించారు. పక్కా ప్లాన్​ ప్రకారం మే 23వ తేదీన ఆయన బయటకు వచ్చి, తన కారు ఎక్కుతున్న క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు.

సీసీటీవీల ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు

కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన మొయిజుద్దీన్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన కుమారుడు ఫర్హాన్ ఇచ్చిన ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల విజువల్స్ ఆధారంగా ఇది యాక్సిడెంట్ కాదని, పథకం ప్రకారమే కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ హత్య వెనక మొత్తం 10 మంది ఉన్నట్టు గుర్తించారు. నిందితులలో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. వారి అదుపులోకి తీసుకొని హత్యకు ఉపయోగించిన వాహనంతో పాటు రూ.10 లక్షలకు పైగా సుపారీ నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com