తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- May 30, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తుండటంతో జనం సతమతమవుతున్నారు. తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రెడ్ అలర్ట్ జిల్లాల జాబితా: ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో శనివారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆరెంజ్ అలర్ట్ జిల్లాల జాబితా: ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు సిద్దిపేట, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో శుక్రవారం నాడు 10 జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఠారెత్తించాయి. అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు:
- ఆసిఫాబాద్ జిల్లా దహేగాం: 46.3 డిగ్రీల సెల్సియస్
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: 46.2 డిగ్రీల సెల్సియస్
- పెద్దపల్లి జిల్లా రామగుండం: 46.2 డిగ్రీల సెల్సియస్
మొత్తం 9 జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని 9 మండలాలు, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 8, పెద్దపల్లిలో 7, నిర్మల్‌లో 6, జగిత్యాలలో 5 మండలాలతో పాటు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, ములుగు జిల్లాల్లోని పలు మండలాలపై వడగాల్పుల ప్రభావం పడింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఒకే రోజు వడదెబ్బ తగిలి 9 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు. అలాగే సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్‌వాడి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు సంగీత (36), సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో ఉపాధి హామీ కూలీ ఇంద్రసేనారెడ్డి (55), నిజామాబాద్ నగరంలో రాచకొండ రాజు (38) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.
ఉపశమనం: రాబోయే రోజుల్లో వర్షాలు, తగ్గుముఖం పట్టనున్న ఎండలు
క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో నేడు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఆదివారం నాడు దక్షిణ, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, జూన్ ఒకటో తేదీ తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







