అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- May 30, 2026
మిన్నెసోటా: ప్రపంచ ఐటీ యవనిక పై తెలుగు బిడ్డలు మరోసారి తమ సత్తా చాటారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన యువతకు అందించే ప్రతిష్టాత్మక 2026 మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్ అవార్డుల్లో తెలుగు అమ్మాయి అనన్య గోలి స్టేట్ హానరబుల్ మెన్షన్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్, నేషనల్ సెంటర్ ఫర్ విమెన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతుల్లో అనన్య ఒకరిగా నిలిచారు. ఈడెన్ ప్రైరీ హైస్కూల్ లో సోఫోమోర్ చదువుతున్న అనన్య, ఇంత చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో అద్భుతమైన లీడర్‌షిప్ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారు.
అనన్య గోలి కేవలం కోడింగ్, చదువులకే పరిమితం కాకుండా సాంకేతిక రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఈడెన్ ప్రైరీ హైస్కూల్‌లో టెక్నాలజీ రంగంలో ఉన్న అమ్మాయిలకు అండగా నిలిచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు టెక్నోవేషన్ చాప్టర్‌ను ఆమె కో ఫౌండర్ గా ప్రారంభించారు. దీని ద్వారా ఎంతో మంది తోటి విద్యార్థినులకు సాంకేతికతపై అవగాహన కల్పిస్తూ, సరికొత్త డిజిటల్ ఆవిష్కరణల వైపు వారిని నడిపిస్తున్నారు. ఐటీ రంగంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణించగలరని అనన్య తన చేతలతో నిరూపిస్తున్నారు.
ఈ అవార్డు గుర్తింపుతో పాటు అనన్య తన అంకితభావంతో అరుదైన ప్రొఫెషనల్ అవకాశాలను కూడా సొంతం చేసుకున్నారు. గత వేసవిలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు జాబ్ షాడో అవకాశాలను దక్కించుకుని, కార్పొరేట్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆమె దగ్గరగా పరిశీలించారు. అంతేకాకుండా, ఐటీ రంగానికి చెందిన ప్రముఖ నిపుణుల సమక్షంలో ఒక ప్రొఫెషనల్ మెంటార్‌ను పొంది, తన నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకుంటున్నారు. అమెరికాలో జరిగిన పలు కీలకమైన టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లలో పాల్గొని, ప్రముఖ గ్లోబల్ టెక్నాలజిస్టులతో నెట్‌వర్కింగ్ చేసే అరుదైన అవకాశాన్ని సైతం ఆమె దక్కించుకోవడం విశేషం.
అనన్యతో పాటు ఈడెన్ ప్రైరీ హైస్కూల్ కు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులు అవార్డులకు ఎంపకియ్యారు. త్రయి కొప్పరపు (స్టేట్ విన్నర్), హిమజ గుంటూరు (స్టేట్ హానరబుల్ మెన్షన్), సరయు కాచం (స్టేట్ హానరబుల్ మెన్షన్) అందుకున్నారు. వీరితో పాటు సిసిలియా రతెమో, ఆయిషా ఆలం, బ్రూక్-లిన్ బైఫీల్డ్, శగున్ శ్రీవాస్తవ కూడా ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్, నేషనల్ సెంటర్ ఫర్ విమెన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించాయి.
అనన్య సాధించిన ఈ అద్భుత విజయంపై ఆమె కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు జెస్సికా బ్రెంట్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అవార్డు కేవలం క్లాస్ రూమ్ మార్కులను బట్టి ఇచ్చేది కాదని.. సాంకేతికతపై అనన్యకు ఉన్న మక్కువ, తోటి విద్యార్థినులను నడిపిస్తున్న తీరు మరియు సమాజ శ్రేయస్సు కోసం ఆమె చేస్తున్న కృషికి దక్కిన గౌరవమని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ యుగం నడుస్తున్న వేళ, కంప్యూటర్ సైన్స్‌ను కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా సమాజాన్ని మెరుగుపరిచే ఒక శక్తివంతమైన సాధనంగా వాడుకుంటూ దూసుకుపోతున్న అనన్య గోలి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలుగు సమాజం ఆకాంక్షిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







